×
Ad

ఆ రెండు మున్సిపల్ పీఠాలపై హస్తం పార్టీ ఆశలు నెరవేరేనా?

ఆఖ‌రికి మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Jeevan Reddy

  • పురపోరు వేళ జగిత్యాల, గద్వాల్‌ కాంగ్రెస్‌లో రచ్చ
  • కొత్త, పాత నేతల మధ్య టికెట్ల కేటాయింపు లొల్లి
  • ఆఖరి నిమిషం వరకు ఎదురుచూపులు, కన్నీళ్లు

Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఇంటిపోరు హస్తం పార్టీకి హెడెక్‌గా మారింది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేష‌న్లకు ఎన్నికలు జరుగుతున్నా..రెండు నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు త‌గాదాలు చికాకు పెడుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి ప‌ది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరారు.

వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, అరికెపూడి గాంధీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మున్సిపల్ ఎన్నిక‌లు లేవు. ఇక మిగ‌తా ఎనిమిది మంది ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జ‌రుగుతున్నాయి. ఇందులో ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తి దూరంగా ఉంటున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆయన వ‌ర్గం బీఆర్‌ఎస్‌తో కలిసి ప‌ని చేస్తోంది. మ‌హిపాల్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారట.

పార్టీ మారి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు మెజారిటీ చోట్ల అంతా స‌ర్దుబాటు చేశారు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాద‌య్య, పార్టీ ఇంచార్జ్ భీం భ‌ర‌త్‌ మ‌ధ్య స‌యోధ్య కుదిరింది. నియోజ‌క‌వ‌ర్గంలో 50 డివిజ‌న్లు ఉంటే చెరి 25 డివిజ‌న్లను రెండు వ‌ర్గాల‌కు కేటాయించారు. ఇక రెండు చోట్ల మాత్రం నేతలు అస్సలే కాంప్రమైజ్‌ కాకపోవడం హస్తం పార్టీ నేతలకు హెడెక్‌గా మారిందట. జ‌గిత్యాల‌, గ‌ద్వాల్..ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వ‌ర్గాలు త‌గ్గేదేలే అంటున్నాయి.

Also Read: అన్నీ నేనే చూస్కోవాలా? పవన్‌ సైలెన్స్ బ్రేక్..! ఇకపై ఏం జరగనుంది?

గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డి వ‌ర్సెస్ పార్టీ ఇంచార్జ్ స‌రితా తిరుప‌తయ్యల మ‌ధ్య పెద్ద లొల్లి న‌డుస్తోంది. ఈ రెండు వ‌ర్గాల్లో స‌రితా తిరుప‌త‌య్య వ‌ర్గానికి ఎంపీ మ‌ల్లుర‌వి స‌పోర్ట్ చేస్తుండ‌టంతో రాజ‌కీయం రంజుగా మారింది. గ‌ద్వాల్ మున్సిపాలిటీలో మొత్తం 37 డివిజ‌న్లు ఉంటే..అన్ని చోట్ల ఎమ్మెల్యే వ‌ర్గం నామినేష‌న్లు వేసింది.

వాకిటి శ్రీహ‌రి ప్రయ‌త్నాలు వృథా
ఈ పంచాయితీకి ఎండ్‌కార్డ్ వేసేందుకు ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహ‌రి ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా వ‌ర్కౌట్‌ కాలేదు. దీంతో గద్వాల్‌ లొల్లిని ప‌రిష్కరించాల్సిందిగా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్‌కు బాధ్యత అప్పగించారు. సంప‌త్ రెండు వ‌ర్గాల‌కు న‌చ్చజెప్పి..ఎమ్మెల్యే బండ్ల వ‌ర్గానికి 30 డివిజ‌న్లు, పార్టీ ఇంచార్జ్ స‌రితా తిరుప‌తయ్య వ‌ర్గానికి ఏడు డివిజ‌న్లు కేటాయించారు. అయినా స‌రే రెండు వ‌ర్గాలు మాత్రం ససేమిరా అంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో జ‌గిత్యాల ఎపిసోడ్ కాక‌రేపుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజ‌య్ వ‌ర్సెస్ మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గానికే పార్టీ బీ-ఫామ్‌లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ విష‌యాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా సీనియ‌ర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్పగించారు. మంత్రి ఉత్తమ్ కూడా రెండు వ‌ర్గాల‌ను ఒక దారికి తెచ్చేందుకు శ‌త‌విధాల ప్రయ‌త్నం చేసినా..కొలిక్కి రాలేదు.

మ‌రోవైపు పార్టీ త‌ర‌ఫున ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ కూడా ఒక అడుగు ముందుకు వేసి..పార్టీ నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని స్పష్టం చేశారు. ఇక ఫైన‌ల్ ఇద్దరిని కూల్ చేసేందుకు రెండువ‌ర్గాల‌కు టికెట్లు కేటాయించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 50 డివిజ‌న్లు ఉంటే..సంజ‌య్‌ వర్గానికి 30, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి వ‌ర్గానికి 20 సీట్లు ఇచ్చారు. దీంతో జీవ‌న్ రెడ్డి వ‌ర్గం గ‌రం గ‌రం అవుతోంది.

జీవ‌న్ రెడ్డి కన్నీళ్లు
ఆఖ‌రికి మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ఆయనను నమ్ముకున్న నేతలంతా కన్నీళ్లు పెట్టుకుని..కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. గద్వాల్‌లో ఎమ్మెల్యేకు 30 సీట్లు ఇస్తే ఆయన మొత్తం 37 సీట్లలో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ సరితా తిరుపతయ్యకు ఏడు సీట్లు కూడా ఇవ్వకుండా తన అభ్యర్థులను పెట్టుకున్నారు.

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కి 30, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి 20 సీట్లు ఇస్తే..జీవన్‌ మాత్రం 50 చోట్ల గుర్తులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌ అన్నట్లుగా గెలవాలని ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ నేతలకు గ‌ద్వాల్‌, జ‌గిత్యాల వ్యవ‌హారం మాత్రం చికాకు తెప్పిస్తోందట.

రెండు చోట్ల రెండు వ‌ర్గాలు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గక‌పోవ‌డంతో..ఆ నియోజకవర్గాల్లోకి మున్సిప‌ల్ పీఠాల‌పై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదట. ఈ గ్రూపు త‌గాదాల‌తో అస‌లుకే మోసం వ‌స్తుందా అనే ఆందోళ‌న‌ పార్టీ అగ్రనాయ‌క‌త్వంలో నెలకొందట. పోలింగ్ నాటికి అయినా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందా.? లేక కాంగ్రెస్‌లో కొత్త, పాత నేతలు గొడవ పడి.. మరో పార్టీకి మేలు చేస్తారా అనేది వేచి చూడాలి.