×
Ad

పురపోరు అయిపోగానే.. పదవుల భర్తీ? మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులెవరికి?

ఫిబ్రవరి 10తో గ్రేటర్ మేయర్‌ విజయలక్ష్మీ పదవీకాలం ముగుస్తుంది. ఆ త్వరాత ఎన్నికల కోడ్ ముగియగానే విజయలక్ష్మీకి మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Revanth Reddy

  • హస్తం పార్టీ నేతల ఆశలు
  • మంత్రివర్గ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్?
  • మార్చి ఫస్ట్ వీక్‌లో క్యాబినెట్ విస్తరణ!

Cabinet Expansion: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే కీలక పదవులను భర్తీతో పాటు క్యాబినెట్ విస్తరణ చేయనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవులతో పాటు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారట. అయితే కొందరు తమకు పదవులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారట.

ఇంకొందరు అయితే తమకు పదవులు ఇవ్వకపోయినా సరే, కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకు పోస్టులు ఇవ్వొద్దని అగ్రనేతలకు తేల్చి చెబుతున్నారట. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర స్టార్ట్ కానుందట.

క్యాబినెట్‌లో మిగిలిన రెండు మంత్రి పదవులతో పాటు పలు కీలకమైన కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందట. మరోవైపు కులసంఘాల కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడంతో పదవుల భర్తీకి బ్రేకులు పడ్డట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే కీలక పదవులు భర్తీ చేస్తామని చెబుతున్నారట ప్రభుత్వ పెద్దలు.

Also Read: ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?

క్యాబినెట్ బెర్తుల కోసం హస్తం పార్టీలో హెవీ కాంపిటేషన్ ఉంది. సామాజిక వర్గాల వారీగా అమాత్య యోగం కోసం పోటీ పడుతున్నారు నేతలు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి గట్టి పట్టుబడుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పరిగిలో హాట్ కామెంట్స్
ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి పరిగి సభలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిని చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ ఫ్లోలో అలా మాట్లాడారా లేక రంజిత్‌రెడ్డిని మంత్రి చేయబోతున్నారా అనేది డిస్కషన్ పాయింట్‌గా మారింది.

ఈ క్రమంలోనే వలస వచ్చిన నేతలకు కాకుండా..పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి గతంలో హామీ ఇచ్చినవారికి అమాత్య పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇక బీసీ వర్గం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్నా..విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వంటి వారు పోటీ పడుతున్నారు.

ఎన్నికల కోడ్ ముగియగానే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన కీలక పదవుల్లో మహిళా కమిషన్ ఒకటి. మహిళా కమిషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులుగా..కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన మహిళలకే అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ మహిళా నేతలు కోరుతున్నారు. అయితే ఈ పదవిని ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫిబ్రవరి 10తో గ్రేటర్ మేయర్‌ విజయలక్ష్మీ పదవీకాలం ముగుస్తుంది. ఆ త్వరాత ఎన్నికల కోడ్ ముగియగానే విజయలక్ష్మీకి మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కష్టపడిన తమను కాదని వేరే పార్టీలో పదవులు అనుభవించిన వారికి మహిళా కమిషన్ లాంటి కీలక పదవి ఇవ్వడం సరైన పద్ధతి కాదని పార్టీ పెద్దల దగ్గర గోడును వెళ్లబోసుకున్నారట.

పోస్టులు ఎవరికి?
వాస్తవానికి ఇప్పటివరకు పనిచేసిన మహిళా కమిషన్ చైర్మన్ కేవలం ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగారు. కమిషన్ పదవీకాలం ఐదేళ్లు కాగా.. మూడున్నరేళ్లు ఈ పదవిలో ఉన్న సునితా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. దీంతో మిగిలిన ఏడాదిన్నర కోసమే నేరెళ్ల శారదకు అవకాశం ఇచ్చారు. ఏడాదిన్నర కాలం కూడా సమర్థవంతంగా పనిచేశారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు ఎక్స్‌టెన్షన్ ఖాయమనే అంతా భావించారు.

అయితే కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పదవీకాలం ఈ నెల 10తో ముగుస్తుండడంతో ఆమెకు మహిళా కమిషన్ ఛైర్మన్ పోస్టు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఇప్పటివరకు శారదకు ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా..కొత్త వారితో భర్తీ చేయకుండా ఆపారన్న టాక్ నడుస్తోంది. దీనిపై ఒరిజినల్ కాంగ్రెస్ మహిళా నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది.

డిమాండ్లు, అభ్యంతరాలు, ఆశావహులు ఈక్వేషన్స్ ఎలా ఉన్నా..మార్చి ఫస్ట్ వీక్‌లో కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మాత్రం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. అయితే పదవుల పందేరంలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నేతల్లో ఎవరి ఆశలు నెరవెరుతాయో చూడాలి మరి.