×
Ad

ఈ ప్రాంతాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు పట్టు దొరకట్లేదా?

మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా 24 వార్డుల‌కు అధికార కాంగ్రెస్ 8 స్థానాల‌కు మాత్రమే పరిమితమైంది.

Congress MLAs

  • మున్సిపోల్స్‌లో సొంత సెగ్మెంట్‌లో ఓటములు
  • సత్తా చాటని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
  • అధికారంలో ఉండి కూడా పైచేయి సాధించలేదని చర్చ

Telangana: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలనే సాధించింది. కొన్ని చోట్ల జ‌రిగిన ప‌రిణ‌మాలు మాత్రం హస్తం పార్టీ నాయ‌క‌త్వాన్ని అసంతృప్తికి గురి చేశాయ‌ట‌. ఓవ‌రాల్‌గా పురపోరులో ఏం జ‌రిగింద‌నే దానిపై ఇంట‌ర్నల్ రిపోర్ట్ తెప్పించుకున్నారట పార్టీ పెద్దలు. కొంద‌రు ఎమ్మెల్యేలు అధికారంలో ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నట్లు స్పష్టమైందట.

ఇలా ప‌ట్టు సాధించ‌లేక‌పోయిన వారిలో మంత్రులు, సీనియ‌ర్ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నట్లు క్లారిటీ వచ్చిందంటున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్ త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని క్యాత‌నప‌ల్లి మున్సిపాలిటీలో మెజారిటీ సాధించ‌లేక‌పోయారు. క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల‌కు గాను కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 7 స్థానాల‌ను మాత్రమే గెల‌వ‌గ‌లిగింది.

మ‌రో మంత్రి వాకిటి శ్రీహ‌రి..సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఉన్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అమ‌ర‌చింత మున్సిపాలిటీలో మెజారిటీ సాధించ‌లేక‌పోయారు. 10 వార్డుల‌కు అధికార కాంగ్రెస్ కేవ‌లం 3 స్థానాలకే పరిమితమైంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వేముల‌వాడ‌లో కూడా మెజారిటీ సీట్లు ద‌క్కించుకోలేక‌పోయింది కాంగ్రెస్ పార్టీ.

Also Read: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్టులు.. సీఐడీ మాజీ ఆఫీసర్ల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

నారాయ‌ణ‌పేట్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ర్ణికా రెడ్డి ఉన్నా..మున్సిపాలిటీని బీజేపీ కైవ‌సం చేసుకుంది. నారాయణపేట్‌ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక క‌ల్వకుర్తి ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి కూడా మున్సిపోల్స్‌లో సత్తా చాటలేకపోయారన్న చర్చ ఉంది.

క‌ల్వకుర్తిలోని ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పూర్ ఫ‌ర్పామెన్స్‌ను కనబరిచింది. ఇక్కడ కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మైంది. దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జి.మ‌ధుసూద‌న్‌రెడ్డి..మున్సిపల్‌ ఎన్నికల్లో మెజారిటీ సాధించ‌లేకపోయారు.

కృష్ణమోహ‌న్ రెడ్డి ప‌రిస్థితీ ఇదే
పార్టీ ఫిరాయించి..కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన గ‌ద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇదే అంటున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సీట్లు సాధించ‌లేదు. ఒక్క పాల‌మూరు జిల్లాలోనే మంత్రి వాకిటి శ్రీహ‌రి, ఎమ్మెల్యేలు ప‌ర్ణికా రెడ్డి, మ‌ధుసూద‌న్ రెడ్డి, క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డి పురపోరులో వెన‌క‌బ‌డిపోయినట్లు రిపోర్టు స్పష్టం చేసిందట.

ఖానాపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నా..అక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీల కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వ‌చ్చాయి. మ‌హ‌బూబాబాద్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముర‌ళీ నాయ‌క్ ఉన్నా..నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల‌లో స్పష్టమైన మెజారిటీ ద‌క్కించుకోలేకపోయారు. పాల‌కుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా.. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ స్థానాలు ద‌క్కాయి.

ఎంపీ క‌డియం కావ్య ఎక్స్ అఫిషియోగా ఓటు వేసి..లాట‌రీ ద్వారా మున్సిపాలిటీని కైవ‌సం చేసుకోవాల్సి వ‌చ్చింది. వ‌ర్ధన్నపేట్‌లో కూడా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా..మెజారిటీ సీట్లు దక్కలేదు. సీనియ‌ర్ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా 24 వార్డుల‌కు అధికార కాంగ్రెస్ 8 స్థానాల‌కు మాత్రమే పరిమితమైంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చోటే ఫ‌లితాలు ఆశించిన ఫలితాలు రాలేదని కాంగ్రెస్ నాయ‌క‌త్వం అసంతృప్తిగా ఉందట. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా..ఇంకా నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌లేదా అంటూ స‌ద‌రు నేత‌ల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు. ఇక‌నైనా నియోజ‌క‌వ‌ర్గంపై ఫోకస్ పెట్టి పనిచేసి గ్రిప్ సాధించాల‌ని త‌లంటిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.