కరీంనగర్ తరహాలోనే రాష్ట్రమంతా లాక్‌డౌన్ అమలు

  • Publish Date - April 27, 2020 / 07:19 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్‌ ఫార్ములా అమలు చెయ్యలని పోలీసులు నిర్ణయించుకున్నారు. 

ఇప్పటికే కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న సమస్యాత్మక ప్రాంతాల్లో వ్యాపార, ఇతర కార్యకలాపాలను మథ్యాహ్నం వరకే పరిమితం చేయగా.. ఇంకా ఆంక్షలు పెంచే యోచన చేస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు కిరాణా, పెట్రోలు బంకులు, ఇతర వ్యాపారాలను ఉదయం 7గంటల నుంచి 12 గంటల వరకే నడపాలని ఆదేశాలు ఉన్నాయి. 

పోలీసులు అనుమతించిన పాసులు ఉంటే తప్ప.. ఎవరినీ రాష్ట్రం లోపలికి, బయటికి వదలట్లేదు.. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన 320కిపైగా కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలను పక్కింటికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. పటిష్ట బందోబస్తు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. 

తెలంగాణ రాష్ట్రంలోముందు బాగా ఎఫెక్ట్ అయిన జిల్లా కరీంనగర్. కరీంనగర్‌లో మర్కజ్‌ కేసులు 17 నమోదుకాగా.. ఇప్పుడు అవి రెండుకు తగ్గాయి. మరో రెండు వారాల్లో కేసులు జీరోకు చేరుకుంటాయని అంటున్నారు. పోలీస్, బల్దియా, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంగా పనిచేసి ప్రమాదకరంగా మారిన కరీంనగర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టించారు. ఇందులో పోలీసుల పనితీరు ప్రశంసనీయం.