తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం.
2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలా ? వద్దా ? లేక రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా ప్రత్యేక నిబంధనలు అయలు చేయాలా ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
దీనికి సంబంధించిన దానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సంబంధిత శాఖలతో విస్తృతంగా సీఎం కేసీఆర్ చర్చించారు. రెండు రోజుల పాటు చర్చించిన అనంతరం మంత్రిమండలి ఎజెండాను ఖరారు చేశారు. 2020, ఏప్రిల్ 25వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు.
ఈ అంశాలన్నింటిపై వివిధ వర్గాల అభిప్రాయాలను సీఎం ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. వీటన్నింటిని కేబినెట్ ముందు ఉంచి చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు, పరీక్షలు, వైద్య సేవలు, కిట్లు, మాస్క్ లు, రక్షణ పరికరాల పంపిణీ, కంటైన్ మెంట్ సముహాల్లో అనుసరించాల్సిన వైఖరి..తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. దీంతో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.