Mancherial Politics: మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్-సీపీఐ పొత్తు కొనసాగుతుండగా..మంచిర్యాల జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా బీఆర్ఎస్‌తో జతకట్టారు సీపీఐ నేతలు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో పొత్తులో భాగంగా బీఆర్ఎస్, సీపీఐ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.
ఇక జిల్లాలోని మరో మున్సిపాలిటీ చెన్నూర్‌లోనూ బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించింది సీపీఐ. పొత్తు-మద్దతు వ్యవహారాన్ని ఇప్పటికే ఈ రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి కూడా. అయితే తమ పార్టీ ధర్మాన్ని వదిలి ఎందుకు కమ్యూనిస్టులు మంచిర్యాల జిల్లాలో కారుతో షికారు చేయాలని డెసిషన్ తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందట.
హస్తం పార్టీ నేతల వ్యవహార శైలి, మాట తీరే అసలుకే ఎసరు పెట్టిందట. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ఇటీవల కాంగ్రెస్, సీపీఐ రెండు పార్టీల ముఖ్యనేతల కీలక సమావేశం జరిగింది. సీపీఐ పది సీట్లతో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కూడా కావాలని కోరింది. అయితే, మీకు పట్టుమని పది ఓట్లు కూడా లేవు..మీకు 10 సీట్లు వైస్ చైర్మన్ కావాలా.? అవన్నీ కాదు, మేం ఇచ్చినవి తీసుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు సమావేశంలో పరోక్షంగా మాట్లాడారట.
Also Read: ఆ రెండు మున్సిపల్ పీఠాలపై హస్తం పార్టీ ఆశలు నెరవేరేనా?
అసలు సీపీఐ ఎక్కడుంది.? ఎన్ని సీట్లు ఇచ్చిన ఒక్కటి రెండు కూడా గెలవడం కష్టమనే హస్తం నేతల సూటిపోట మాటలతో హర్ట్ అయిన సీపీఐ నేతలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారట. విషయం తెలుసుకున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ పార్టీ నేతలపై సీరియస్ అయ్యి సీపీఐకి నాలుగు సీట్లు ఇచ్చేందుకు సుముఖం వ్యక్తం చేస్తూ ఓ నాయకుడికి మధ్యవర్తిత్వం చేయమని చెప్పారట.
అయితే సదరు నాయకుడు..తన స్థాయి ఏంటి..? వాళ్ల స్థాయి ఏంటి..? తాను మాట్లాడను అని చెప్పడంతో కమ్యూనిస్టులు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. భవిష్యత్‌లోనూ బీఆర్ఎస్‌తోనే ప్రయాణం చేస్తామని ప్రకటించారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో చేతులు కలిపి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుతున్న సీపీఐని వ్యూహాత్మకంగా తమ వైపు తిప్పుకున్నారు బీఆర్ఎస్ నేతలు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే చెన్నూర్ మున్సిపాలిటీలో మాత్రం సీపీఐ పోటీలో లేకుండా పూర్తిస్థాయిలో బీఆర్ఎస్‌కు మద్దతు తెలుపనుంది. ఈ నేపథ్యంలోనే క్యాతన్ పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్, సీపీఐ చేతులు కలిపి ముందుకెళ్తున్నాయి.
ఇదంతా గమనిస్తున్న జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి సీపీఐని బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈ పొత్తుల వ్యవహారం చెన్నూర్ మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్షం దూకుడు మీదుంటే అధికార పక్షం ఆత్మరక్షణ ధోరణితో ముందుకు సాగుతోందట. వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలవాల్సిన చోట హస్తం పార్టీ నేతల నోటి దురుసు తనం..బీఆర్ఎస్‌కు మేలు చేస్తోందట.
సీట్లు అడిగితే తమను తక్కువ చేసి మాట్లాడారని హర్ట్ అయిన సీపీఐ నేతలు.. కారు పార్టీతో కలిసి కాంగ్రెస్‌ను ఢీకొడుతున్నారు. క్యాతన్‌పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో మిత్రధర్మం వీడి బయటకొచ్చిన కమ్యూనిస్టులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న బీఆర్ఎస్ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి.