Cyber Fraud Alert : వాట్సాప్‌లో ‘నో’ అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ! సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌పై సీపీ సజ్జనర్ హెచ్చరిక

Cyber Fraud Alert :హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సైబర్‌ మోసాలపై హెచ్చరించారు. వాట్సాప్‌లో నకిలీ బ్యాంకు సందేశాలకు స్పందించవద్దని, డబ్బులు పోతే 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Cyber Fraud Alert

  • ఓటీపీ చెప్పకపోయినా డబ్బులు మాయం.. వాట్సాప్‌ యూజర్లు జాగ్రత్త
  • ఒక్క రిప్లైతో బ్యాంక్‌ ఖాతాకు ముప్పు.. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అలర్ట్‌
  • బ్యాంక్‌ నుంచి డబ్బులు కట్‌ అయ్యాయంటూ నకిలీ మెసేజ్‌లు..

Cyber Fraud Alert : సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఓటీపీని చెప్పకపోయినా అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకున్నా కొన్ని సందర్భాల్లో నగదు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాట్సాప్‌ సందేశాలను ఆసరాగా చేసుకుని ఆటో ఎగ్జిక్యూషన్‌ ఫైళ్ల ద్వారా మొబైల్‌ ఫోన్లపై దాడులు చేసే అవకాశం ఉందని ఆయన ఎక్స్‌ వేదికగా వివరించారు.

ఫేక్ బ్యాంకు మెసేజ్‌లతో వల :
బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్‌ అయినట్లు గుర్తుతెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపడం, ఈ మోసాల్లో తాము ఎలాంటి లావాదేవీ చేయలేదని భావించే వ్యక్తులను ‘నో’ అని సమాధానం ఇవ్వాలని సందేశంలో కోరుతారు. అయితే, అలాంటి మెసేజ్‌లకు స్పందించినప్పుడు మాల్‌వేర్‌ స్క్రిప్ట్‌లు పనిచేసి ఫోన్‌ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని సజ్జనార్‌ హెచ్చరించారు.

Read Also : Best Redmi Smartphone Deals : అమెజాన్ సేల్‌లో రెడ్‌మి ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. బ్యాంకు ఆఫర్లతో రూ.15 వేల వరకు ఆదా!

ఇటీవల ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయమైన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అపరిచిత నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ‘Yes’, ‘No’ అంటూ ఎలాంటి సమాధానమూ ఇవ్వవద్దని సూచించారు.

అనుమానం వస్తే ఏం చేయాలి? :
ఖాతాలో నగదు తగ్గినట్లు మెసేజ్‌ వస్తే.. ఆ సందేశంలోని వివరాలను నమ్మకుండా బ్యాంకు అధికారిక యాప్‌ను ఓపెన్ చేసి ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలించాలి. అవసరమైతే బ్యాంకు అధికారిక కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి లావాదేవీ నిజమో కాదో చెక్ చేసుకోవాలి.

సైబర్‌ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నవారు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలి. అలాగే (cybercrime.gov.in) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అనుమానాస్పద సందేశాలకు స్పందించకపోవడం, అధికారిక మార్గాల్లోనే సమాచారాన్ని వెరిఫై చేసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.