Hyderabad Rain Alert: హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ కంపెనీలకు బిగ్ అలర్ట్.. సైబరాబాద్ పోలీసుల కీలక ఆదేశాలు
సైబరాబాద్(Hyderabad Rain Alert) పరిధిలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
- V Santhosh Kumar
- Updated on- July 27, 2026 / 04:19 PM IST
Cyberabad traffic police advisory heavy rain it companies early logout
- సైబరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక
- ఐటీ కంపెనీలకు ముందస్తు అడ్వైజరీ
- దశలవారీగా ఎర్లీ లాగౌట్ సూచన
Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్ పరిధిలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఐటి కారిడార్ ప్రాంతాల్లో వర్షం పడితే కిలోమీటర్ల మేర నిలిచిపోయే నరకప్రాయమైన ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ముందుస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐటీ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. వర్షం సమయంలో ఒకేసారి అందరూ రోడ్లపైకి రాకుండా, ఉద్యోగులకు దశలవారీగా ‘ఎర్లీ లాగౌట్’ సౌకర్యం కల్పించాలని స్పష్టమైన సూచనలు చేశారు.
Also Read – E20 Janatha Party: CJP సూపర్ హిట్.. పుట్టుకొచ్చిన మరో రెండు కొత్త పార్టీలు.. నెక్ట్స్ టార్గెట్..
ప్రణాళికాబద్ధమైన ట్రాఫిక్ నిర్వహణ:
ఈ సారి వర్షాల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేలా సైబరాబాద్ పోలీసులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఐటీ (Hyderabad Rain Alert)సంస్థలు తమ ఉద్యోగులను ఏ సమయాల్లో ఎర్లీ లాగౌట్ చేస్తున్నారో ముందస్తుగా తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కంపెనీల వివరాలు, లాగౌట్ టైమింగ్స్ లభిస్తే, దానికి అనుగుణంగా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సులువవుతుందని స్పష్టం చేశారు. ఈ బృహత్తర యత్నంలో అన్ని ఐటీ కంపెనీలు తమకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు.
ప్రజలకు విజ్ఞప్తి & అప్రమత్తత:
హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు జలమయమయ్యే అవకాశం ఉన్నందున, వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు హితవు పలికారు. ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ముందు వాతావరణ అప్‌డేట్లు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
