Stree Ride: తెలంగాణలో ‘స్త్రీ రైడ్’ సేవలు.. మహిళల రక్షణే లక్ష్యం.. ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
మహిళల రక్షణే లక్ష్యంగా తెలంగాణాలో 'స్త్రీ రైడ్(Stree Ride)' సేవలను ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్.
- V Santhosh Kumar
- Updated on- June 6, 2026 / 06:40 PM IST
DGP CV Anand launched the ‘Stree Ride’ project in Telangana
- మహిళల సురక్షిత ప్రయాణాలకు ‘స్త్రీ రైడ్’
- మహిళా డ్రైవర్లతో ప్రత్యేక రవాణా సౌకర్యం
- ఆర్థిక స్వాలంబన కోసం ప్రత్యేక శిక్షణ
Stree Ride: మహిళల భద్రత, స్వయం ఉపాధే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ‘స్త్రీ రైడ్’ (Stree Ride) అనే వినూత్న ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ర్యాపిడో తరహాలోనే మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లను అందుబాటులోకి తెస్తూ ‘మోవో ఫ్లీట్ యాప్’ (Movo Fleet App) ద్వారా ఈ సేవలను డిజైన్ చేశారు.
ప్రత్యేక శిక్షణ – డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ:
మహిళలు ఆర్థికంగా రాణించేలా తొలి విడతలో 55 మందిని ‘స్త్రీ రైడర్లు’గా ఎంపిక చేశారు. అంబర్‌పేట్ పోలీస్ లైన్స్‌లో వీరికి టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలను నడపడంలో ఉచిత శిక్షణ ఇచ్చి, డ్రైవింగ్ లైసెన్సులను అందజేశారు. ప్రైవేట్ యాప్స్‌లో పురుష డ్రైవర్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ఎంతగానో దోహదపడనుంది.
భద్రతతో పాటు ఆత్మరక్షణలోనూ మెలకువలు:
ఈ ప్రాజెక్ట్ కింద మహిళలు యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. కేవలం డ్రైవింగే కాకుండా, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) లోనూ శిక్షణ పొందిన ఈ రైడర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు తక్షణ సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
