Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ లెటర్.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో హీటెక్కిన పాలిటిక్స్..
Minister Sridhar Babu : పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో రెండున్నరేళ్లుగా వర్గపోరు భగ్గుమంటోంది. ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత మరోసారి రచ్చకెక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది.
- Harish Thanniru
- Published on- November 4, 2026 / 11:16 AM IST
MP Gaddam Vamshikrishna Minister Sridhar Babu
Minister Sridhar Babu : ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చురాజేసింది. ఏకంగా ఓ మంత్రి.. ఎమ్మెల్యేపై బూతులతో మాటల దాడికి దిగడం హాట్ టాపిక్ అయింది. ఇదే సమయంలో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు ధర్నాకు హాజరుకాకపోవడంపై.. మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ ఓ ఎంపీ రాసిన లేఖ అగ్గిరాజేస్తుంది.
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో రెండున్నరేళ్లుగా వర్గపోరు భగ్గుమంటోంది. ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత మరోసారి రచ్చకెక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. పెద్దపల్లి ఎంపీ వంశీని పార్లమెంటు పరిధిలోని ఇద్దరు మంత్రులు చాలా లైట్ తీసుకుంటున్నారట. ఎమ్మెల్యేలు, మంత్రులు వంశీని అసలు ఎంపీగా కూడా ట్రీట్ చేయక పోవడమే అంతర్గత విభేధాలకు దారి తీసిందట. ఈ కారణంగానే రెండున్నరేళ్లుగా ఎంపీ వంశీకృష్ణ తన అసహనాన్ని, అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికార యంత్రాంగంపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
తనను ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోకపోవడనికి కారణం మంత్రి శ్రీధర్ బాబే అనేది ఎంపీ వంశీకృష్ణ అనుమానమట. అందుకే ఆయనపై విమర్శల డోస్ పెంచుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు ఎయిర్‌పోర్ట్ రావాలని తాను చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారంటూ ఎంపీ వంశీకృష్ణ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి కేంద్రమంత్రుల చుట్టూ ఎయిర్‌పోర్ట్ కోసం తాను తిరుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఎంపీ ఆరోపిస్తున్నారు.
పెద్దపల్లికి ESI ఆస్పత్రిని మంజూరు చేయిస్తే..ఇప్పటివరకు స్థల పరిశీలన చేసేందుకు కూడా కలెక్టర్ ఆసక్తి చూపించట్లేదని మండిపడ్డారు ఎంపీ. ఇటీవల దసరా వేడుకల సందర్భంగా గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణను పిలవలేదని..ప్రోటోకాల్ పాటించలేదంటూ..రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులతో రచ్చచేశారు ఎంపీ వంశీ ఫాలోవర్స్. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల ప్రకారమే కలెక్టర్ నడుచుకుంటారా.? ఎంపీని పట్టించుకోరా అంటూనే..నువ్వు కలెక్టర్వా లేక మంత్రి పీఏవా అంటూ ఘాటు విమర్శలు చేశారు ఎంపీ వంశీకృష్ణ.
ఎంపీ వంశీకృష్ణ తండ్రి మంత్రి వివేక్‌తో శ్రీధర్ బాబుకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. కొడుకును ఎంపీగా గెలిపించుకునేందుకు శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని గెలిపించుకున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ సమయంలో వివేక్‌కు అధిష్టానం మంత్రి పదవి ఇచ్చినప్పుడు..ఆయనకు చెక్ పెట్టేందుకు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇప్పించుకున్నారనేది వివేక్ వర్గం ఆరోపణ. అప్పటినుంచే వంశీకి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందట.
మంథని, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఎంపీ వంశీకృష్ణకు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం సరిగా అందటం లేదట. అందుకే అసంతృప్తితో రగిలిపోతున్నారట ఎంపీ. వంశీకృష్ణ పెదనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, నాన్న వివేక్ చెన్నూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంథని, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంచిర్యాల ఐదు నియోజకవర్గాల్లో ఎంపీకి ప్రోటోకాల్ పాటించకపోవడంతో అసమ్మతి రాజుకుందట.
కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి క్యాడర్‌తో పాటు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయ రమణారావు, ప్రేమ్‌సాగర్ రావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. శ్రీధర్ బాబు మాటే వింటున్నారనేది ఎంపీ డౌట్ అట. అధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసులు అంతా శ్రీధర్ బాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారనేది ఎంపీ వంశీ ఆగ్రహనికి కారణమంటుంది ఆయన వర్గం. తనను ఇన్సల్ట్ చేసేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్న ఎంపీ..తన సోషల్ మీడియా టీమ్‌తో వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారట. మంత్రులు, ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో తనకంటూ ఓ వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో బిజీ అయ్యారట ఎంపీ. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ రాజుకుందట.
వంశీ తన తాత దివంగత వెంకటస్వామి పేరుతో ఏర్పాటు చేసిన కాకా ట్రస్టు ద్వారా స్కూల్ పిల్లలకు బ్యాగులు పంపిణీ చేసినందుకు మహిళ ప్రజాప్రతినిధులను, పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేయడంపై ఎంపీ వంశీ సీరియస్ అయ్యారు. శ్రీధర్ బాబు ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనే కారణంతో..ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన ధర్నాకు శ్రీధర్ బాబుతో పాటుగా ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయ రమణారావు, ప్రేమ్ సాగర్ రావు ఎందుకు రాలేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఇదే విషయంపై ఎంపీ లెటర్ ప్యాడ్‌పై వ్యంగ్యాస్త్రాలతో రాసిన ఓ లేఖ సర్క్యులేట్ అవుతుంది. ఢిల్లీకి రాని వాళ్లను సస్సెండ్ చేయొద్దంటూ సెటైరికల్‌గా రాసిన లేఖ కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. నాయకుల మధ్య సఖ్యత లోపించినా రాష్ట్ర పార్టీ పెద్దలు సీరియస్‌గా రియాక్ట్ కాకపోవడం వెనుక కారణమేంటన్న దానిపై క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటుందట. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.
