TG Doctors Strike : డాక్టర్ల సమ్మెబాట.. నేటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్.. వైద్యుల డిమాండ్లు ఇవే! జీవో నంబర్ 38 అంటే ఏమిటి?

Doctors strike : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి ఓపీ సేవలను బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వైద్యుల బదిలీలప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతోందని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) పేర్కొంది.

Doctors strike

  • తెలంగాణలో వైద్యుల సమ్మెబాట
  • నేటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
  • జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్

TG Doctors Strike : : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి ఓపీ సేవలను బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ (టీజీజీడీఏ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read : Ponguleti Srinivas Reddy: తెలంగాణలో పెరుగనున్న భూముల ధరల.. స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీలప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతోందని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) పేర్కొంది. జీవో నం. 38 ప్రకారం.. బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల వందలాది మంది వైద్యులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు టీజీజీడీఏ పేర్కొంది.

ముఖ్యంగా స్పౌజ్ (భార్యాభర్తలు) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నవారికి, అనారోగ్య సమస్యలు ఉండి ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తూ, వ్యక్తిగత కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరుతున్న వైద్యుల విజ్ఞప్తులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని, గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీల నుంచి మిన హాయింపు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని అమలు చేయకపోవడం సంఘం నేతలు వాపోతున్నారు.

సమ్మె ప్రభావంతో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ తోపాటు అన్ని జిల్లాల్లోని పెద్దాస్పత్రుల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు టీజీజీడీఏ పేర్కొంది. అయితే, అత్యవసర సర్జరీలు మినహా, ముందుగా నిర్ణయించిన ఎలక్టివ్ ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడాలని, వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

జీవో నంబర్ 38 అంటే ఏమిటి?
బదిలీల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ప్రభుత్వ ఉత్తర్వునే జీవో నంబర్ 38 అంటారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో భార్యాభర్తలను ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో ఉంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. బదిలీలు పారదర్శకంగా జరగడానికి ఇది ఎంతో కీలకం. ఈ ఉత్తర్వులోని నిబంధనలను అమలు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తామని టీజీజీడీఏ హెచ్చరించింది.