ED Raids – Telangana: తెలంగాణలో మరోసారి ఈడీ దాడుల కలకలం.. ఆ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
ప్రస్తుతం నాలుగు కంపెనీలకు సంబంధించి 8 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి.
- Naveen
- Published on- May 27, 2026 / 05:13 PM IST
ED Raids – Telangana: తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇసుక, గ్రానైట్ వ్యాపారులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించారనే ఆరోపణలతో మొత్తం నాలుగు కంపెనీలకు సంబంధించి 8 చోట్ల సోదాలు చేస్తున్నారు.
గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వాహకులు జీఎస్టీ ఎగ్గొట్టి పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడగట్టినట్లుగా ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉంది. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ కు చెందిన ఒక వ్యాపారవేత్త ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి పెద్ద మొత్తంలో గ్రానైట్ తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పోల్చుకుంటే.. కరీంనగర్ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో గ్రానైట్ ఎక్స్ పోర్ట్ అవుతుంటుంది.
కరీంనగర్ లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు కంపెనీలకు సంబంధించి 8 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి. రాత్రి వరకు సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ లోని ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్స్ ను అధికారులు సేకరించినట్లుగా సమాచారం.
Also Read: అబ్బో మేడం గారి ప్లాన్ మాములుగా లేదే.. రూ.30 లక్షల లంచం కేసు.. ACB వలకి చిక్కిన MRO
