KCR: నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.. తెలంగాణ పునర్ నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే- కేసీఆర్

తెలంగాణ కోసం నేను బయలుదేరితే నన్ను చాలామంది అవమానించారు. అవమానాలు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

  • Updated on- April 20, 2026 / 11:26 PM IST

KCR: జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ టార్గెట్ గా చెలరేగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని కేసీఆర్ జోస్యం చెప్పారు.

సీనియర్ నేత జీవన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు కేసీఆర్. జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నోడని అన్నారు. జీవన్ రెడ్డి గురించి ఎక్కువ చెబితే మాకు మేము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందన్నారు. జీవన్ రెడ్డి, తాను మంచి స్నేహితులం అని, పార్టీలు వేరైనా కలిసి పనిచేశామని కేసీఆర్ గుర్తు చేశారు. జగిత్యాల ప్రజల దీవెనతో జీవన్ రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జీవన్ రెడ్డికి అనేక మంది అభిమానులు ఉన్నారని అన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం జీవన్ రెడ్డి పాటుపడ్డారని చెప్పారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంటుందని సర్వే చేశానని, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు చెప్పాయని కేసీఆర్ తెలిపారు.

ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోయినా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయనను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. జీవన్ రెడ్డికి పదవులు కొత్తేమీ కాదు. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తున్నా. ఆరు నూరైనా వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ అధికారంలో రాగానే మంచి పదవిలో ఉండి తెలంగాణకు సేవ చేసే అవకాశం జీవన్ రెడ్డికి కల్పిస్తాను. జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే, తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు.

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఏం చెయ్యలేకపోతుండే. అసెంబ్లీలో తెలంగాణ అనొద్దని మనపై భయంకరమైన దాడి జరిగింది. మెట్ పల్లి నుంచి దుబాయ్, బొంబాయి పొయ్యే వాళ్ళు. పాలమూరు నూటికి నూరు శాతం వలస వెళ్ళేది. నా తెలంగాణలో గంజి కేంద్రాలు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు అది చూసి చలించి పోయా. తెలంగాణ కోసం ఎవరూ మాట్లాడలేకపోయేవారు. ఆ సమయంలో చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచితే, తగ్గించమని నేను లెటర్ రాశాను. కరెంట్ చార్జీలు తగ్గించమని ప్రజలు రోడ్లపైకి వస్తే బషీర్ బాగ్ లో మిట్ట మధ్యాహ్నం ప్రజలను పిట్టల్లా కాల్చివేశారు.
అది చూసి నా మనసు చలించిపోయింది. లాభం లేదని తెలంగాణ కోసం ఒక్కడినే బయలుదేరా.

అవమానాలు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..

తెలంగాణ కోసం నేను బయలుదేరితే నన్ను చాలామంది అవమానించారు. అవమానాలు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. చెరువులు బాగు చేసుకుంటే చెరువుల కింద పొలాలు బాగా పండుతాయని ఆలోచన చేశా. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనని అసెంబ్లీ సాక్షిగా చెప్పా. ఐదేళ్ల పాటు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఎందుకు రావడం లేదో చెప్పాలి.

పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారు. నేను సచ్చేది లేదు. ఓట్లు వేసేటప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పా. నా మాట కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. నేను ఇక్కడ సభ పెడితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేడిగడ్డలో సభ పెట్టారు. ఒకే దఫా వేయాల్సిన రైతుబంధు నెలకొకసారి వేస్తున్నారు. డబ్బులు లేక చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చిల్లర మాటలే తప్ప, ఒక్కటంటే ఒక కార్యాచరణ లేదు.

యాప్ లు పట్టుకొని తిరిగితే కాళ్ళకి వాపులు వస్తున్నాయి..

యూరియా బస్తా కోసం యాప్ లు పట్టుకొని తిరుగుతున్నారు. యాప్ లు పట్టుకొని తిరిగితే కాళ్ళకి వాపులు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయంలో ఆటో అతనికి ఫోన్ చేస్తే ఎన్ని అంటే అన్ని యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేస్తుండే. బీఆర్ఎస్ హయంలో 75 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాము.
రాష్ట్ర ఆర్థిక ఆదాయం దిగజారిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండేది. ఈరోజు భూమి అమ్మేవాడు ఉన్నాడు కానీ కొనేవాడే దిక్కులేదు.

మంచి నీళ్ల కోసం గోస పడే పరిస్థితి వచ్చింది. మక్కలు కొనే పరిస్థితి లేదు. పంట వేసిన దగ్గర నుంచి కొనేవరకు బీఆర్ఎస్ రైతులకు అండగా నిలబడింది. చేనేత కార్మికులు అవస్థ పడుతున్నారు. బీఆర్ఎస్ హయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC ఇచ్చాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ప్రతిఒక్కరు బాధపడుతున్నారు.

కాంగ్రెస్ కాకి మాటలే చెప్పింది తప్ప ఒక్కరికి కూడా మంచి చెయ్యలేకపోతోంది. బీఆర్ఎస్ హయంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చుకున్నాము. పల్లె ప్రకృతి పెడితే కనీసం చెట్లకు నీళ్ళు పోసే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలు మురికి కూపాలుగా అయిపోయాయి. అందుకే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత నోటి నుంచి కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనే మాట వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకంతోనే హైడ్రా తీసి అవతల పడేస్తాం.

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామని అంటున్నారు. మూసీ సుందరీకరణ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే. ఏ రంగంలో చూసినా ఒక రకమైన దోపిడీ, గుండాగిరే చేస్తున్నారు. కరెంట్ మోటార్లకు మీటర్ పెట్టమని ఆనాడు మోదీ నా మెడపై కత్తి పెట్టారు. రైతుల కోసం మీటర్ పెట్టనియ్యకుండా అడ్డుకున్నా. మీటర్ పెడితే కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఈ ప్రభుత్వం సంతకం పెట్టింది. యాదవులకు గొర్రె పిల్లలు, ముదిరాజ్ లకు చేప పిల్లలు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయంలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చాము.

6 గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. తెలంగాణ పునర్ నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చెయ్యకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రభుత్వం తీరు కూల్చివేతలు, కాల్చివేతలు తప్ప ఏమీ లేదు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్ర యాత్ర నుంచే మొదలు కాబోతుంది” అని కేసీఆర్ అన్నారు.

Also Read: రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు జమ..