Essentials Price Hike: పండుగ పూట ధరల మోత.. ఎల్నినో దెబ్బకు భగ్గుమంటున్న మార్కెట్.. జనం విలవిల!
ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి నిత్యావసరాలు, ప్రయాణ ఛార్జీల(Essentials Price Hike) ధరలు పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులైంది.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 11:19 AM IST
Festival season price hike el nino impact on essential commodities in telangana
Essentials Price Hike: తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసరాల ధరలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన తీవ్ర ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా పడక జలాశయాలు అడుగంటిపోవడంతో వరి, పప్పుధాన్యాల దిగుబడితో పాటు కూరగాయల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఈ పరిణామం మార్కెట్లో తీవ్ర కొరతకు దారితీయడంతో సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు దసరా పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరిట 50 శాతం అదనపు ఛార్జీలు బాదడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులై తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆకాశాన్నంటిన బియ్యం, పప్పుధాన్యాల రేట్లు:
దిగుబడి తగ్గడంతో వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు (Essentials Price Hike)పెంచేశారు. గత నెలలో హోల్సేల్లో కిలో రూ.65 ఉన్న హెచ్ఎంటీ జైశ్రీరాం బియ్యం ఏకంగా రూ.95కి చేరగా, రూ.45 ఉన్న సోనామసూరి రూ.70కి ఎగబాకింది. సెప్టెంబరులో కిలో రూ.76 ఉన్న శనగపప్పు ధర రూ.96కు, రూ.96 ఉన్న పెసరపప్పు రూ.110కి పెరిగాయి. గతంలో నెలకు నిత్యావసరాలు, కూరగాయల కోసం రూ.9,500 ఖర్చయితే, ప్రస్తుతం రూ.12 వేలు దాటుతుండటంతో సగం నెలకే పర్సులు ఖాళీ అయి అప్పులు చేయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు.
ఎలక్ట్రానిక్స్ ప్రియం.. ఆర్టీసీ స్పెషల్ బస్సుల బాదుడు:
నిత్యవసరాలతో పాటు ముడిపదార్థాలు, మెమరీ చిప్ల ధరలు పెరగడంతో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఏసీల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. డిజిటల్స్టాక్ గణాంకాల ప్రకారం ఆన్లైన్ ల్యాప్టాప్ల సగటు ధరలు 32 శాతం, ఏసీలు 11 శాతం, స్మార్ట్ఫోన్ల ధరలు 7 శాతం పెరిగాయి. పండుగకు సొంతూర్లకు వెళ్దామనుకునే ప్రయాణికులపై ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీల భారం మోపడంతో పండుగ సంతోషం సగమైపోతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Government: తెలంగాణ రైతులకు కరువు సాయం.. ఎకరానికి రూ. 10 వేలు.. అధికారులతో సీఎం సమీక్ష
అక్రమ నిల్వలను అరికడితేనే ఊరట:
వర్షాభావం వల్ల కూరగాయల కొనుగోళ్లు తగ్గి వ్యాపారులు కూడా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. రాబోయే 15-20 రోజుల్లో వర్షాలు పడకపోతే ఆహారధాన్యాల ధరలు మరో 10 నుంచి 20 శాతం పెరిగే ప్రమాదముందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. పండుగ సీజన్లో డిమాండ్ ఏకంగా 30 శాతం వరకు పడిపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సరుకుల అక్రమ నిల్వలను అరికడితేనే ధరలు కొంతైనా అదుపులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
