Gold Man Surya Bhai : ‘గోల్డ్‌మ్యాన్‌’ సూర్యాభాయ్‌పై కేసు నమోదు.. తక్కువ ధరకే బంగారం పేరుతో భారీ మోసం..

Gold Man Surya Bhai : పాతబస్తీ గోల్డ్‌మ్యాన్‌గా పేరుగాంచిన పల్లపు సురేశ్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Gold Man Surya Bhai

Gold Man Surya Bhai : పాతబస్తీ గోల్డ్‌మ్యాన్‌గా పేరుగాంచిన పల్లపు సురేశ్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తక్కువ ధరకే విదేశీ బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్లు ఆయన పై ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కేసును తదుపరి దర్యాప్తు కోసం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Also Read : Gade Sai Krishna Case : సాయికృష్ణ కేసులో సంచలన మలుపు.. హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ ఆరా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాభాయ్ తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సన్నిహితుడినని చెప్పి నమ్మించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్కువ ధరకే విదేశీ బంగారం అందిస్తానని చెప్పి వారి నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, డబ్బులు తీసుకున్న తరువాత బంగారం ఇవ్వకపోగా.. నగదు కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు సూర్యాభాయ్ ఇంటికి వెళ్లి నిలదీశారు.

బాధితులు నిలదీయడంతో సూర్యాభాయ్ తన వద్ద ఉన్న మూడు ఐఫోన్లను వారికి ఇచ్చాడు. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పినట్లు సమాచారం. అలాగే మరో రూ.20 లక్షలకు సంబంధించిన చెక్కును కూడా ఇచ్చి వారిని పంపించాడు. ఆ తరువాత తమను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హిమాయత్‌నగర్‌లోని నిలోఫర్ ప్రాంతంలో బంగారం పేరుతో బాధితుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు.

అత్తాపూర్ పోలీసులు ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.