Telangana Gig Workers Policy 2026 : తెలంగాణలో అమల్లోకి గిగ్ వర్కర్ల చట్టం.. పాలసీ వివరాలు, కలిగే ప్రయోజనాలు ఇవే.. 6లక్షల మందికి భరోసా..
Telangana Gig Workers Policy 2026 : తెలంగాణలో గిగ్ కార్మికుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే చట్టం రూపొందించడంతో పాటు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయగా, రాహుల్‌గాంధీ శనివారం ప్రభుత్వం రూపొందించిన చట్టం, ఖరారు చేసిన విధివిధానాలు ప్రారంభించారు.
Telangana Gig Workers Policy 2026
Telangana Gig Workers Policy 2026 : మీరు ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసినా.. క్యాబ్ బుక్ చేసినా.. మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి సేవలందించేది గిగ్ వర్కర్లే. అయితే రోజంతా కష్టపడుతున్న ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ, ఆర్థిక భరోసా ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక గిగ్ వర్కర్ల పాలసీని తీసుకొచ్చి వారికి సామాజిక భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. మరి ఈ కొత్త పాలసీతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయి? ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని కొన్ని కీలక అంశాలు ఏమిటో తెలుసుకుందాం.
తెలంగాణలో గిగ్ కార్మికుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే చట్టం రూపొందించడంతో పాటు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయగా, రాహుల్‌గాంధీ శనివారం ప్రభుత్వం రూపొందించిన చట్టం, ఖరారు చేసిన విధివిధానాలు ప్రారంభించారు. ఈ కొత్త చట్టం ద్వారా అసంఘటిత రంగంలో పని చేస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని సర్కారు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా జీవిత, ప్రమాద బీమాతో పాటు ఇతర సామాజిక పథకాలను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది గిగ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గిగ్ వర్కర్ల చట్టంలోని ప్రధాన అంశాలు ఇవే..
♦ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్ వర్కర్ల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ. ప్రతి కార్మికుడికి ఆధార్ అనుసంధానిత ప్రత్యేక గుర్తింపు సంఖ్య (GID) కేటాయింపు.
♦ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రయోజనాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బోర్డు.
♦ గిగ్ వర్కర్ల చట్టం ప్రకారం కార్మికుడికి ఇచ్చే గౌరవ వేతనంలో 2 శాతాన్ని సంక్షేమ నిధి కింద బోర్డుకు జమ చేయాలి. ఈ భారాన్ని పూర్తిగా ప్లాట్‌ఫాం సంస్థలే భరించాలి.
♦ నిర్ణీత గడువులోగా లేదా గడువు ముగిసిన 10 రోజుల్లోగా వేతనాన్ని ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి.
♦ వేతనం, ఇన్సెంటివ్స్, మినహాయింపుల వివరాలను సులభంగా అర్థమయ్యే భాషలో డిజిటల్ స్టేట్మెంట్ రూపంలో అందించాలి.
♦ సంస్థలు ఇష్టానుసారం ఒప్పంద నియమావళిని మార్చడానికి వీల్లేదు.
♦ ఏవైనా మార్పులు చేయాలంటే 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి.
♦ అర్హులైన గిగ్ వర్కర్లకు జీవిత బీమా, ప్రమాద బీమా, వైద్య సహాయం, వైకల్య ప్రయోజనాలు, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ వంటి పథకాలను బోర్డు రూపొందించవచ్చు.
♦ సరైన కారణాలు చూపకుండా కార్మికుడిని తొలగించరాదు. తొలగించాల్సి వస్తే 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. విచారణ పూర్తయిన 7 రోజుల్లోగా తుది నిర్ణయం ప్రకటించాలి.
♦ నేరాలు, వేధింపులు, దాడులకు పాల్పడితే మాత్రం ఎలాంటి నోటీసు లేకుండానే తక్షణమే తొలగించే అధికారం సంస్థలకు ఉంటుంది.
♦ 100 మందికి పైగా కార్మికులు ఉన్న ప్రతి సంస్థ అంతర్గత వివాదాల పరిష్కార కమిటీని నియమించుకోవాలి.
♦ బోర్డు తరఫున ఫిర్యాదుల పరిష్కార అధికారి ఉంటారు. అధికారి తీర్పుపై అభ్యంతరం ఉంటే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
♦ తెలంగాణలో పనిచేసే గిగ్ ప్లాట్‌ఫామ్ కంపెనీలు బోర్డులో నమోదు కావాలి. కార్మికుల సంఖ్య, చెల్లింపులు, సంక్షేమ నిధి వివరాలను క్రమం తప్పకుండా సమర్పించాలి.
♦ నిబంధనలను ఉల్లంఘించినా, సంక్షేమ నిధికి చెల్లింపులు చేయడంలో విఫలమైనా ప్లాట్‌ఫాం సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
♦ సంక్షేమ నిధి చెల్లించని కంపెనీలకు మొదటి ఉల్లంఘనపై రూ.50 వేల జరిమానా. రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.లక్షా 50వేలు. నాలుగోసారి నుంచి చెల్లించాల్సిన బకాయి మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.
