Kavitha: కవిత విమర్శలపై బీఆర్ఎస్ పెద్దల మౌనమెందుకు? కారణం అదేనా?

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ కంటే బీఆర్ఎస్‌నే ఆమె ఎక్కువగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ కన్నతండ్రి, తనకు పదవులు ఇచ్చి నాయకురాలిగా నిలబెట్టిన కేసీఆర్‌పై కవిత చేసిన కామెంట్స్ సామాన్య జనంలోనూ చర్చకు దారితీశాయి.

  • Published on- April 27, 2026 / 10:24 PM IST
  • సొంత తండ్రి, గులాబీ బాస్‌పై కవిత పర్సనల్ అటాక్
  • కవిత అన్నేసి మాటలన్నా గులాబీ పెద్దల నో కామెంట్
  • కవితకు కౌంటర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్
  • కావాలనే కవిత విమర్శలకు బీఆర్ఎస్ పెద్దలు కౌంటర్ ఇవ్వట్లేదా.?
  • ఇంటి ఆడబిడ్డగా గౌరవించే ఆమెను పల్లెతు మాట అనడం లేదా?

 

Kavitha: ఇక నుంచి అక్కను కాదు..తెలంగాణ అమ్మను. మీ కష్టాల్లో తోడుంటాను అంటూ పార్టీని ప్రకటించేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత..కన్న తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే విమర్శల దాడి చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గులాబీ దళాన్ని టార్గెట్ చేశారు. తాను ఫక్తు పొలిటీషియన్‌గా మారిపోయాననే సంకేతాలూ ఇచ్చేశారు. అక్క అంతలా దుమ్మెత్తి పోసినా..కారు పార్టీ నేతలు ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇంటి ఆడబిడ్డగా గౌరవించే ఆమెకు కౌంటర్ ఇవ్వట్లేదా? లేక కవిత విమర్శలకు స్పందిస్తే..ఆమెకు ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుందని సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నారా? పార్టీ పెద్దలే రియాక్ట్ కాకపోవడంతో..వాళ్లూ వాళ్లూ ఒక్కటే మధ్యలో మనకెందుకు అని కార్యకర్తలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా?

కారు నుంచి దించేసిన పది నెలల తర్వాత పార్టీ ప్రకటించిన కవితక్క..అంతకు మించి అన్నట్లు కామెంట్స్ చేశారు. తన పార్టీ ఆవిర్భావ వేదిక మీద నుంచి డైరెక్టుగా గులాబీ బాస్ కేసీఆర్ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్..తెలంగాణ రాష్ట్ర సేన అని తన పార్టీ పేరును ప్రకటించిన కవిత..గతంలో తాను పనిచేసి..తనకు ఈ స్థాయి ఇచ్చిన బీఆర్ఎస్‌పైనే, ఆ పార్టీ అధినేత టార్గెట్‌గానే విమర్శల దాడి చేశారు. కవిత తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టడం కారు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

మరమనిషి అంటూ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు..

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ కంటే బీఆర్ఎస్‌నే ఆమె ఎక్కువగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ కన్నతండ్రి, తనకు పదవులు ఇచ్చి నాయకురాలిగా నిలబెట్టిన కేసీఆర్‌పై కవిత చేసిన కామెంట్స్ సామాన్య జనంలోనూ చర్చకు దారితీశాయి. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇంత ఘాటుగా రియాక్ట్ కాని కవిత..సొంత రాజకీయ ప్రకటన వేళ ఒక్కసారిగా మాటల దాడిని పెంచారు. మన కేసీఆర్ కాదు, మరమనిషంటూ విరుచుకుపడ్డారు. తమ అధినేత కేసీఆర్‌ను అంత మాట అనడమేంటని గులాబీ లీడర్లు తీవ్రంగా హర్ట్ అయ్యారు.

కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?

అయితే కవిత ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఇప్పటివరకు కవిత ఎపిసోడ్ పై ఎక్కడా రియాక్ట్ కాలేదు కేసీఆర్. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి..లేటెస్ట్ గా తెలంగాణ భవన్‌లో జరిగిన మీటింగ్ వరకు ఏ డయాస్ మీద స్పందించలేదు. కవిత ఇంతగా తనను పర్సనల్ గా టార్గెట్ చేసినా..ఆమె కామెంట్స్ గులాబీ దళాన్ని హర్ట్ చేసినా..కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నది అందరి మదిలో మెదులుతున్న వేయి డాలర్ల ప్రశ్న. కేసీఆర్ సరే కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు కూడా ఎందుకు మాట్లాడటం లేదన్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదట. కవిత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్ రావులను టార్గెట్ చేసినా..ఒక్కరు కూడా స్పందించకపోవడంపై బీఆర్ఎస్ క్యాడర్ లోనే కాదు..సాధారణ జనంలో కూడా చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ పెద్దల మౌనం వెనుక బలమైన కారణాలు..!

కవిత కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినా ఎవ్వరూ స్పందించకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా..ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా..కవిత తీరుతో అంతో ఇంతో డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉన్నా..కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇంకా ఆమెను ఇంటి ఆడబిడ్డగానే చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ కవిత మహిళ కావడంతో ఆమెపై మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే కవిత ఎంత రాజకీయం చేసినా, తమపై విమర్శలు, ఆరోపణలు చేసినా కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉంటున్నారట. ఒక లిమిట్‌కు మించి కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్య నేతలకు, అనుచరులకు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సూచించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

కవితకు అనవసరపు ఎలివేషన్ ఇచ్చినట్లు అవుతుందా?

కవితకు..బీఆర్ఎస్ అగ్రనేతలు కౌంటర్ ఇవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత అన్నేసి మాటలన్నా గులాబీ పెద్దలెవరూ రియాక్ట్ కాకపోవడం వెనుక వ్యూహాత్మక మౌనం ఉందని భావిస్తున్నారు. కావాలనే కవితను అవైడ్ చేస్తూ..ఆమె విమర్శలకు కౌంటర్ ఇవ్వట్లేదన్న టాక్ ఉంది. కవిత వ్యాఖ్యలకు స్పందించడం మొదలు పెడితే..ఆమె అదే పనిగా విమర్శలు చేస్తూ పోతుందని భావిస్తున్నారట. అలా రెగ్యులర్‌గా ఆమెకు కౌంటర్ ఇస్తుంటే అనవసరపు ఎలివేషన్ ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం కూడా ఉందట.

అసలు ఎజెండా సైడ్ ట్రాక్ పట్టి..కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఎపిసోడ్ నడిచే అవకాశం ఉంటుందని.. కవిత కూడా ఈ వ్యూహంతోనే విమర్శలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. అందుకే కవిత విషయంలో బీఆర్ఎస్ పెద్దల వ్యూహాత్మక మౌనమే తప్ప..మరొకటి కాదన్న చర్చ అయితే జరుగుతోంది.

అటు గులాబీ పార్టీ పెద్దలెవరూ రియాక్ట్ కాకపోవడంతో..ఇటు కార్యకర్తలూ అదే లైన్‌లో వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. వాళ్లూ వాళ్లూ ఒక్కటే ..ఎప్పుడైనా కలిసిపోతారు..మధ్యలో మనం బట్టలు చించుకుని బలి కావడం ఎందుకని గులాబీ సైనికులు కూడా మౌనంగా ఉండిపోతున్నారట. మొత్తానికి కవిత ఎన్ని విమర్శలు చేసినా..ఆమె విషయంలో బీఆర్ఎస్ నేతలెవరూ ఇప్పట్లో రియాక్ట్ అయ్యే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు.

Also Read: డోంట్ కేర్..! కవిత పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు