Congress Representative Image (Image Credit To Original Source)
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర పోటీనే నడుస్తోంది. దాదాపు డజను మంది నేతలు రేసులో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డిలు పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఈరవత్రి అనిల్ కుమార్, మహిళా కోటాలో ఇటీవలే ఉమెన్ కమిషన్ ఛైర్మన్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న నేరెళ్ల శారదలు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య, మైనారిటీ నుండి అజ్మతుల్లా హుస్సేన్ ఉన్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి కుసుమకుమార్ ఢిల్లీ స్థాయిలో పైరవీ చేస్తున్నారు. ఖాళీ అవుతున్న రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వాలని హైకమాండ్ ఎప్పుడో డిసైడ్ అయిందంటున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను కంటిన్యూ చేయడం ఖాయమైపోయింది. ఇక రెండో సీటు కోసం పోటీ మామూలుగా లేదు. అయితే ఈ సీటు కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం డిసైడ్ చేసిందనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది.
రెండో రాజ్యసభ సీటుకు పార్టీ అధిష్టానం వంశీచంద్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తోందట. వంశీచంద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ పాలసీ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మళ్లీ పదవులు ఇవ్వొద్దని..టికెట్ త్యాగం చేసిన వారికే ప్రయారిటీ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ వంశీచంద్ పేరును అధిష్టానం ప్రపోజ్ చేసేసరికి..రాష్ట్ర నాయకత్వం గతంలో అనుకున్న విషయాన్ని తెరపైకి తెచ్చిందట. అయితే వంశీచంద్‌కు ఇవ్వాలంటూ ఏకంగా ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీనే సూచిస్తుండటంతో రాష్ట్ర నాయకత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోయిందట.
తన విషయంలో రాష్ట్ర నాయకత్వం సహకరించదనే ఆలోచనతో..వంశీ..ప్రియాంక గాంధీతో చెప్పిస్తున్నారని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి జాతీయ స్థాయిలో వంశీ అవసరాలున్నాయని..రాజ్యసభ ఎంపీగా ఉంటే పార్టీకి మరింత ఉపయోగం ఉంటుందని ప్రియాంక గాంధీ చెబుతున్నారట. గతంలో జగిత్యాల ఎమ్మెల్యేగా ఓడిన జీవన్‌రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వలేదా అంటూ గుర్తు చేస్తున్నారట హస్తం పార్టీ పెద్దలు.
రాజ్యసభ రేసులోకి వంశీచంద్ రావడంతో..కొత్త కొత్త ఆశావహులు తెరమీదకు వస్తున్నారట. వంశీచంద్‌ను సాకుగా చూపి..గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో చాలామంది రాజ్యసభ సీటు కోసం..తమ పేరును పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం పార్టీ అధిష్టానానికి చెబుతున్నా.. ప్రియాంకగాంధీ ససేమిరా అంటున్నారట. పార్టీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీసీసీల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నందున వంశీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అలా తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు..కాంగ్రెస్ అధిష్టానమే ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున..నామినేషన్ల గడువులోపు ఈక్వేషన్లు ఏమైనా మారుతాయా? లేక అభిషేక్ మను సింఘ్వీ, వంశీచంద్‌రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్లేనా అన్నది చూడాలి.