Congress Nominated Posts: కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు..! సీనియర్లు ఎందుకు రగిలిపోతున్నారు? వారి ఆవేదనకు రీజన్ ఏంటి?
TG Congress Nominated Posts: ఈ జాబితా చూడగానే పలువురు వైస్ చైర్మన్లు గాంధీ భవన్‌లోనే కన్నీళ్లు కార్చి బయటకి వెళ్లిపోయారట. ఈ విషయంలో నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ను కలిసి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారట.
- Naveen
- Updated on- May 15, 2026 / 06:21 PM IST
- 11 కుల కార్పొరేషన్ పోస్టుల భర్తీతో వార్ షురూ
- ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం
- పార్టీని నమ్ముకొని ఉంటే అవమానించారంటూ ఆవేదన
Telangana Congress: సాగదీశారు. ఆ తర్వాత..తప్పదనుకున్నారో..లేక లీడర్ల ఒత్తిడి తట్టుకోలేకో..సస్పెన్స్ కు తెరదించుతూ 11 కార్పొరేషన్లకు పోస్టులను ప్రకటించారు. అయితే నామినేటెడ్ పోస్టుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేశారని..అధికార కాంగ్రెస్‌లో రచ్చ స్టార్ట్ అయింది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పదవులు కట్టబెట్టి..కట్టర్ కాంగ్రెస్ లీడర్లకు చిన్న పోస్టులు ఇస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల జాబితా చూడగానే పలువురు నేతలకు కళ్లలో నీళ్లు తిరిగినంత పనైందట. తమను అవమానపర్చారని ముఖ్యనేతల దగ్గర నిట్టూరుస్తున్నారట. కార్పొరేషన్ పదవుల విషయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చేంటి.? నేతలు అంతలా ఆవేదన చెందడానికి రీజన్ ఏమై ఉంటుంది.?
నామినేటెడ్ పదవుల భర్తీ అధికార కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి తెరదీసింది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..పదవులు రావడం లేదని ఇన్నాళ్లు నిట్టూర్చారు. ముఖ్యనేతల మీద ఒత్తిడి పెట్టారు. ఇంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా భర్తీ అవుతున్న పదవుల విషయంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పదవులు ఇవ్వడం లేదని నిరాశ చెందిన హస్తం పార్టీ నేతలు పదవులు ఇవ్వగానే పంపకాల్లో అన్యాయం జరిగిందని వాయిస్ రేజ్ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా..ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు ఇచ్చారని రగిలిపోతున్నారు. పార్టీ కోసం, పవర్ లోకి రావడం కోసం కష్టపడిన వాళ్లకు పదవులు వస్తాయనుకుంటే మళ్లీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులా?
తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్‌గా 11 కుల సహకార సంస్థలకు ఛైర్మన్లు, వైస్ చైర్మన్లను..మరో ఆరు సంస్థలకు ఛైర్మన్లను మాత్రమే నియమించింది. అయితే పదవుల కోసం రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారిని గుర్తించకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ప్యారాచూట్ నేతలకే పెద్ద పీట వేశారని ఆవేదన..
ప్రభుత్వం నియమించిన 11 కుల సహకార సంస్థలకు ఛైర్మన్లలో ఆరుగురు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారేనని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వచ్చిన ప్యారాచూట్ నేతలకే పెద్ద పీట వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఏకంగా డబుల్ బోనాంజా మాదిరిగా వరుసగా అవకాశాలు ఇచ్చి.. పార్టీలో ముందు నుంచి ఉన్న వారికి మొండి చెయ్యి చూపారని మండిపడుతున్నారు.
లేటెస్ట్‌గా పదవులు పొందిన వారిలో కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్.. తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ సరితా తిరుపతయ్య.. జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరి..అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఓటమి పాలయ్యారు. వారికే మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం ఎంతవరకు భావ్యమని ఫైర్ అవుతున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ రఘురామ్ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాస్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, బోయ కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప ఉన్నారు. వీరి నియామకంపై కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
పదవుల జాబితా చూసి కంటతడి..
ప్యారాచూట్ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇలా పెద్ద పీట వేయడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. పదవి ఇవ్వకపోయినా బాగుండునని, రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడిన వారికి చిన్న పదవులు ఇచ్చి..ఎన్నికల ముందు పార్టీలో చేరిన ప్యారాచూట్ నేతలకు పెద్ద పదవులు కట్టబెట్టి అవమానపరిచారని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితా చూడగానే పలువురు వైస్ చైర్మన్లు గాంధీ భవన్‌లోనే కన్నీళ్లు కార్చి బయటకి వెళ్లిపోయారట. పార్టీలో ఆయా సామాజిక వర్గాల్లో సీనియర్, సిన్సియర్ నేతలున్నప్పటికీ వారిని కాదని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా కమిషన్ విషయంలో కూడా కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వకుండా ..ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి అవకాశాలు ఇవ్వడమేంటని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మూడేళ్ల పదవీకాలంతో నియమితురాలు కావాల్సిన మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి నేరెళ్ల శారదకు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. పార్టీ కోసం పాతికేళ్లుగా కష్టపడ్డ మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి తగిన గౌరవం ఇవ్వకపోవడంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
2022లో కేబినెట్ ర్యాంకుతో మూడేళ్ల పదవీ కాలానికి సునీతాలక్ష్మారెడ్డికి మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు అప్పటి సీఎం కేసీఆర్. అయితే 2023 ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ పదవి ఖాళీ అయింది. దీంతో మిగిలిన ఏడాదిన్నర కాలం మాత్రమే నేరెళ్ల శారదకు ఛాన్స్ దక్కింది. అది కూడా క్యాబినెట్ ర్యాంకు తొలిగించి ఇచ్చారన్న విమర్శలూ అప్పట్లోనే వచ్చాయి. దీంతో ఆమెకు రెన్యూవల్ చేస్తారని నేరెళ్ల శారదతో పాటు కాంగ్రెస్ నేతలంతా భావించారు. కానీ ఆమె ఆశలు ఆవిరయ్యాయి.
బీఆర్ఎస్ నుంచి వచ్చినోళ్లకు పదవులు ఇవ్వడమేంటి?
ఇక మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు, నేతలు రవళీ రెడ్డి, ఇందిరా శోభన్ వంటి నేతలు ఉమెన్ కమిషన్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. కానీ వీరెవరికి ఛాన్స్ దక్కకపోగా..బీఆర్ఎస్ నుంచి వచ్చిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీకి మహిళా కమిషన్ ఛైర్మన్ పోస్ట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఈ విషయంలో నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ను కలిసి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారట. అయితే మహిళా కమిషన్ విషయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇవ్వాల్సి వచ్చిందని సర్ది చెప్పారట. ఇలా కాంగ్రెస్ పదవుల పందేరం కొత్త పంచాయితీకి దారి తీస్తోంది. పదవులతో కొందరు సంతృప్తి చెందగా, మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు. భవిష్యత్ లో అసంతృప్తి వ్యక్తం కాకుండా..హస్తం పార్టీ పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
Also Read: ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ఖతం.. 20 గంటలు కరెంట్ కోతలు..
