Gossip Garage: వాళ్లు మాత్రమే ఎందుకు వాడాలి? మేము మంత్రులం కాదా? అమాత్యుల మధ్య గాలిమోటర్ చిచ్చు..
కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Gossip Garage: ఆ మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ఎందుకు వాడాలి? మేము మంత్రులం కాదా? ప్రభుత్వ హెలికాప్టర్ వాడే హక్కు మాకు లేదా? తెలంగాణలో కొందరు మంత్రుల మనోవేదన ఇది.. అవును కొంత మంది మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ వాడుకునే ఛాన్స్ వస్తోందని, మిగతా మంత్రులకు ఆ అవకాశం దక్కకుండా పోతుందన్న చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ అంశం గతంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ మంత్రుల్లో హెలికాప్టర్ ఉపయోగించే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్లేందుకు మంత్రులు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. అయితే కొంత మంది మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ఉపయోగిస్తుండటం, మరికొందరికి హెలికాప్టర్ అందుబాటులో ఉండకపోవడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సీఎం పర్యటన ఎక్కడా లేనప్పుడు, హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మాత్రమే మంత్రులు దానిని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ అలా ఒక్క మంత్రికే కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు దూరంగా ఉండే జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్ ను ఉపయోగించుకునే అవకాశం ఉందని..అందుకు ప్రత్యేకంగా నిబంధనలంటూ ఏమీ లేవని అధికారులు చెబుతున్నారు.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో ‘కొత్త’ మంటలు.. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నదెవరు?
నలుగైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్ గా వాడేస్తున్నారు..!
అయితే కొన్ని కీలక శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రులు తరుచూ హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్నారు. దూర ప్రాంతాలకే కాదు దగ్గర్లో ఉన్న జిల్లాలకు కూడా అందులోనే వెళ్తున్నారన్న టాక్ సచివాలయవర్గాల్లో విన్పిస్తోంది. నలుగైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్ గా హెలికాప్టర్ ను ఉపయోగించుకోవడం, మిగతా మంత్రులకు ఆ అవకాశం రాకపోవడంతో వారంతా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఓ మంత్రి ఐతే రంగారెడ్డి జిల్లా పర్యటనకు సైతం హెలికాప్టర్ ను వాడుతున్నారంటూ చర్చ నడుస్తోంది. కొంతమంది మంత్రులకు దూరంలో ఉన్న జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చినా హెలికాప్టర్ ఇవ్వడం లేదని వాపోతున్నారట. పైగా నల్గొండ జిల్లా మంత్రులు మాత్రమే హెలికాప్టర్ వాడుతున్నారని.. అందులోను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రమే హెలికాప్టర్‌ను తెగ వాడేస్తున్నారని ఓ సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
Also Read : ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..
హెలికాప్టర్‌ను పల్లె వెలుగు బస్సులా మార్చారంటూ విమర్శలు..
అంతే కాకుండా కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ వ్యవహారం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నల్గొండ మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ భాగ్యం ఉందని తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ కామెంట్ చేయడంతో తెలంగాణ క్యాబినెట్‌లో మరోసారి గాలిమోటర్ రచ్చ మొదలైంది.
అటు విపక్షాలు సైతం మంత్రుల హెలికాప్టర్ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది మంత్రులు హెలికాప్టర్‌ను పల్లె వెలుగు బస్సులా మార్చారంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఈ గాలిమోటర్ రచ్చకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెడతారా లేక ఇలాగే ఇష్యూ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here