KTR: ఆ కేసులో కేటీఆర్‌ అరెస్ట్ అయితే.. రాజకీయంగా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

ఒక మాజీ మంత్రి.. అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ను.. A1 గా చేరుస్తూ కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

  • Published On : March 24, 2026 / 10:31 PM IST
  • ఈ-కార్ రేసు కేసుపై హాట్‌హాట్‌ డిస్కషన్‌..
  • నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు..
  • ఈ కేసులో కేటీఆర్‌ అరెస్ట్ ఖాయమనే ప్రచారం..
  • నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయితే.. వాట్‌ నెక్ట్స్‌ ?
  • అరెస్ట్ జరిగితే సానుభూతి రావడం ఖాయమా?

KTR: ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా.. అదే జరిగితే తర్వాత పరిణామాలు ఏంటి.. కేటీఆర్‌ జైలుకు వెళ్లాల్సి వస్తే నష్టం ఎవరికి.. లాభం ఎవరికి? తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఇదే. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. అది ఆయనకు సానుభూతిగా మారుతుందా అనేది కీలకంగా మారింది. ఇంతకీ ఏం జరిగే అవకాశం ఉంది.. రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు ఏంటి.. ఈ-కార్‌ రేసు ఎపిసోడ్‌పై జరుగుతున్న చర్చ ఏంటి..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు.. ఫార్ములా ఈ రేసు కేసు ఉచ్చు బిగుస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలైంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రాజకీయ అవినీతి జరిగిందన్న కోణంలో.. ఏబీసీ విచారణ జరిపింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని.. ప్రభుత్వ నిధులను వ్యూహం ప్రకారం ప్రైవేట్ కంపెనీకి మళ్లించి.. ఆ కంపెనీ నుంచి పార్టీ ఫండ్‌గా మార్చుకున్నారనేది ఏసీబీ అభియోగం. ఈ రేసు నిర్వహణతో HMDA 75.88 కోట్లు నష్టపోగా.. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 45కోట్లు లబ్ది పొందిందని ఏసీబీ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి.. బీఆర్ఎస్‌కు 44కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఏసీబీ ఆరోపణలు రుజువు అయితే.. కేటీఆర్‌కు శిక్ష పడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

రాజకీయంగా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం ?

ఒక మాజీ మంత్రి.. అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ను.. A1 గా చేరుస్తూ కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మరోసారి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయగా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. అది అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తి రేపుతోంది.

ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసిన వారిపై అవినీతి ఆరోపణలు వస్తే.. అది వందలు, వేల కోట్ల వ్యవహారం అయి ఉంటుంది. రాజకీయాల్లో చరిత్ర పేజీలు తిరగేస్తే కనిపించేది కూడా అదే ! ఐతే ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో.. ఏసీబీ ఆరోపిస్తోంది మాత్రం.. 45 కోట్ల మేర అవినీతి జరిగిందని ! అది కూడా నిబంధనల ప్రకారం నిధులు చెల్లించలేదని ! ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. ఫార్ములా ఈ సంస్థకు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన అభియోగం. ఆ సంస్థకు 45 కోట్ల మేర లబ్ది చేకూర్చి.. బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో 44 కోట్ల తీసుకున్నారన్నది మరో అభియోగం. ఐతే ఇక్కడ మొత్తం అవినీతి జరిగింది 45 కోట్లు అనేది కీలకమైన విషయం. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. కేవలం 45 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్ట్ అయి జైలుకు వెళ్తే.. అది జనాల్లోకి ఎలాంటి సంకేతాలను తీసుకెళ్తుందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

కచ్చితంగా జనాల్లో కేటీఆర్‌పై సానుభూతి వచ్చే చాన్స్‌..!

కేటీఆర్ అరెస్ట్ అయితే.. అది కచ్చితంగా జనాల్లో ఆయనపై సానుభూతి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏవైనా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్‌ చూసుకుంటున్నారు. అలాంటి ఆయనను అరెస్ట్ చేస్తే.. బీఆర్ఎస్‌ను వీక్‌ చేయాలనే కుట్రలు చేస్తున్నారనే కోణంలోనే జనాలు.. ఈ వ్యవహారాన్ని చూసే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఐతే వర్గం వాదన ఇంకోలా ఉంది. ఎంత దుర్వినియోగం జరిగిందని కాదు.. అవినీతి జరిగిందా లేదా అనేదే జనాలు చూస్తారనే డిస్కషన్ నడుస్తోంది. దీంతో కేటీఆర్ అరెస్ట్ అయితే.. అధికార కాంగ్రెస్‌కే లాభం జరుగుతుందని వాళ్లు పాయింట్ లాగుతున్నారు. మరి ఎవరి అంచనా నిజం అవుతుంది.. ఎవరి వాదన గెలుస్తుంది.. అసలు నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా.. అదే జరిగితే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అనేది తేలాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

Also Read: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టుకు బీఆర్ఎస్..