Kaleshwaram Commission Report: కాళేశ్వరం ఎపిసోడ్‌‌లో పైచేయి ఎవరిది? కొత్త టర్న్‌ తీసుకోనుందా?

కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటులో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ అంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే హైకోర్ట్ ఆర్డర్స్ వచ్చాయని ఆరోపిస్తోంది.

  • Published on- April 22, 2026 / 09:02 PM IST

Kaleshwaram Commission Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే రచ్చ. ఆ లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌పైనే పొలిటికల్‌ గేమ్. ఫైనల్‌గా విచారణ కమిషన్‌ వేశారు. ఆ రిపోర్ట్‌ బేస్‌గానే చర్యలకు సిద్ధమయ్యారు. కట్ చేస్తే కాళేశ్వరం కమిషన్‌ నివేదికను నిలిపివేసి..బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది హైకోర్టు. అటు విద్యుత్ కమిషన్, ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులపై ఫైట్‌లో పైచేయి సాధించామంటూ గులాబీ పార్టీ ఖుష్ అవుతోంది. సర్కార్ మాత్రం పిక్చర్ అబీ బాకీ హై అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తోంది. కమలం పార్టీ మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడుతోందట. కాళేశ్వరం విషయంలో పైచేయి ఎవరిది? ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే బీఆర్ఎస్ ఏం చేయబోతోంది?

సర్కార్ విచారణ..బీఆర్ఎస్ అబ్జక్షన్..ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ను నిలిపివేసింది హైకోర్టు. కమిషన్ 655 పేజీల రిపోర్ట్ ఇస్తే..ఆ నివేదికతో పాటు కమిషన్‌ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కారు పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును నిలిపివేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఎలాంటి నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది హైకోర్టు.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..!

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు లాంటిదంటూ బీఆర్ఎస్ అటాక్ స్టార్ట్ చేసింది. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని..మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయాలని మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటును హైకోర్టు సమర్ధించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ ఇష్యూపై అయినా కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని..కానీ ఆ కమిషన్‌ నిబంధనలు పాటించలేదని కోర్టు చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు బీఆర్ఎస్‌ లీడర్లు. రేవంత్ సర్కార్‌ మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గురువారం జరిగే క్యాబినెట్‌లో భేటీలో డిస్కస్ చేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని భావిస్తున్నారట.

గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా తనను విచారణకు పిలిచే అధికారం జస్టిస్ నరసింహారెడ్డికి లేదంటూ కేసీఆర్ ఇచ్చిన రిప్లై అప్పట్లో చర్చకు దారితీసింది. ఈ విచారణ చట్ట విరుద్ధమని, రాజకీయ కక్షతో ఏర్పాటు చేశారని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్‌ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

రేవంత్‌ది రాజకీయ కక్ష సాధింపు చర్యగా రివర్స్ అటాక్..

ఇప్పుడు కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై కూడా హైకోర్టుకెళ్లి మరీ ఆర్డర్స్‌ తెచ్చుకుంది బీఆర్ఎస్. అపోజిషన్‌లోకి వచ్చినప్పటి నుంచి కారు పార్టీని ఈ రెండు ఇష్యూస్‌లో ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు తాము చేసిన పోరాటం ఫలించిందని..గులాబీ దళం హ్యాపీగా ఫీల్ అవుతోంది. రేవంత్‌ది రాజకీయ కక్ష సాధింపు చర్యగా రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు ఇష్యూస్‌కు ఇంతటితో ఎండ్‌కార్డ్ పడ్డట్లేనా? వచ్చే ఎన్నికల వరకు కాళేశ్వరం చుట్టే రచ్చ జరగబోతోందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది.

మరోవైపు కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటులో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ అంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయని ఆరోపిస్తోంది. సీబీఐ విచారణ కోసం లేఖ రాస్తే..బీజేపీ తమ విజ్ఞప్తిని తొక్కి పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నేతలను సేవ్‌ చేసేందుకు బీజేపీ ఆరాటపడుతోందని విమర్శిస్తోంది. బీజేపీ మాత్రం ఎంటైర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రేవంత్‌ సర్కార్ లేఖ రాయలేదని చెప్తోంది. పైగా కాళేశ్వరం రిపోర్ట్‌తో పాటు..NDSA నివేదికను బేస్‌ చేసుకుని విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని అంటోంది బీజేపీ. NDSA రిపోర్ట్‌ ఆధారంగా ఒక్క మేడిగడ్డపై దర్యాప్తు చేస్తే ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేస్తోంది.

హైకోర్ట్ తీర్పును అడ్వాంటేజ్‌గా భావిస్తున్న గులాబీ దళం..!

NDSA కేవలం డ్యామ్ సేఫ్టీ, డిజైన్‌పైనే అభ్యంతరాలు తెలిపిందని..అవినీతిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదని చెప్తోంది బీజేపీ. రేవంత్‌కు నిజాయితే ఉంటే..మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని లేఖ రాసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ బీజేపీ సేఫ్ గేమ్‌కు తెరదీసింది. ఇలా కమిషన్‌ చుట్టూ ట్రయాంగల్‌ వార్ నడుస్తోంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ మాత్రం హ్యాపీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే..తాము ఇంప్లీడ్ కావాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ చేసి వచ్చారు. స్టేట్‌ సర్కార్ సుప్రీంలో పిటిషన్ వేస్తే..హైకోర్టు తీర్పు ఆధారంగా..సుప్రీంలో ఫైట్‌ చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఎంటైర్ కాళేశ్వరం ఎపిసోడ్‌లో బీఆర్ఎస్‌కు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగినా..కరెక్ట్‌ ఎన్నికల హీట్‌ మొదలయ్యే టైమ్‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్వాంటేజ్‌గా భావిస్తోంది గులాబీ దళం.

Also Read: సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు.. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక