Bhatti Vs Renuka: ఖమ్మంలో భట్టి Vs రేణుక.. లొల్లి ఎక్కడ మొదలైంది? పీసీసీకి ఫిర్యాదు చేసేవరకు ఎందుకెళ్లింది?

ఖమ్మం జిల్లాలో ఏ మాత్రం బలం, అనుచర వర్గం లేని రేణుకా చౌదరి నోటికొచ్చినట్లు విమర్శలు చేసి పార్టీని, మంత్రులను ఇబ్బంది పెడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు.

  • Updated on- May 20, 2026 / 10:55 PM IST
  • ఖమ్మంలో భట్టి విక్రమార్క Vs రేణుకా చౌదరి
  • నామినేటెడ్ పదవుల పంపకంలో పంచాయితీ
  • వైరా నియోజకవర్గానికి ఐదు నామినేటెడ్ పోస్టులు
  • రేణుకా కామెంట్స్‌పై రగిలిపోతున్న భట్టి అనుచరులు
  • పీసీసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిన నేతలు

Bhatti Vs Renuka: డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్‌. ఖమ్మం గుమ్మంలో.. అధికార కాంగ్రెస్‌లో ఇంటర్నల్‌ ఫైట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్డ్‌ వార్‌ హీటెక్కిస్తోందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుకా అనుచరగణం ఎవరూ తగ్గకపోవడంతో..ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారాయి. ఇంతకు పదవుల లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది? పీసీసీకి ఫిర్యాదు చేసే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డట్లు?

ఖమ్మం జిల్లాలో నామినేటెడ్‌ పదవుల పంపకం..అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య చిచ్చు పెట్టింది. ఒకే నియోజకవర్గానికి ఐదు పోస్టులు ఎలా ఇస్తారంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి..ఫుల్‌ ఫైర్ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ జెండా మోసిన వాళ్లను పక్కనపెట్టి.. చెప్పులు మోసేవాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు..ఖమ్మం పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదంటూ..సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారామే.

చెప్పులు, సంచులు మోసేవాళ్లకే నామినేటెడ్‌ పదవులు?

అయితే ఎప్పటినుంచో భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరిగా అన్నట్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోసారి భట్టి విక్రమార్క అనుచరులపై రేణుకా చౌదరి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ హీట్‌ను పెంచాయి. భట్టి అనుచరులు కూడా రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్‌ పార్టీ కాదని అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే అంటున్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లను పక్కనపెట్టి, పార్టీలు మారి వచ్చిన వారికి, చెప్పులు, సంచులు మోసేవాళ్లకే నామినేటెడ్‌ పదవులు కట్టబెడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారామె.

ఖమ్మం జిల్లా సుడా ఛైర్మన్‌ పదవిని దుర్గాప్రసాద్‌కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల పంపకంపైనే కాదు..ప్రభుత్వ పనితీరుపైనా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు మంత్రులు అయ్యారని అన్నారు రేణాక చౌదరి. కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టికి కూడా అన్ని విషయాలను తీసుకెళ్లాకే, బహిరంగంగా విమర్శలు చేస్తున్నట్లు కూడా చెప్పారామె.

ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్, నామినేటెడ్‌ పదవుల కేటాయింపుపై రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం అడ్రస్‌ లేని వారికి, అసలు కాంగ్రెస్‌ కోసం పని చేయని వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. వైరా టౌన్‌ పరిధిలోని వారికే ఐదు కార్పొరేషన్‌, నామినేటెడ్‌ పదవులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని క్వశ్చన్ చేశారు. వైరా ప్రాంతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటివ్‌ ప్లేస్‌ కాబట్టి అక్కడ ఎక్కువ పదవులు ఇచ్చారా? అనే వాయిస్ రేజ్ చేశారామె.

పదవులన్నీ భట్టికే ఇచ్చేయండి అంటూ ఫైర్..

ఆయన డిప్యూటీ సీఎం, పదేండ్లు ఎమ్మెల్యే, అయితే జిల్లాలోని పదవులన్నీ ఆయనకే ఇచ్చేయమనండి. మిగతా కార్యకర్తలు ఎవరూ వద్దు, తప్పుకోండని బహిరంగంగా చెప్పేయండి అంటూ ఫైర్ అయ్యారు. అహంకార పూరిత రాజకీయాలు సరికాదంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. పదవుల కేటాయింపు వ్యవహారాన్ని, సిఫార్సుల వెనకున్న నిజాలను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ దృష్టికి కూడా ఆధారాలతో సహా తీసుకెళ్లానంటున్నారు రేణుక.

నన్ను బ్యాన్‌ చేసే మొనగాడు పుట్టలేదు..!

పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, త్యాగాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కాలనే తాను ఈ పోరాటం చేస్తున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు రేణుకా చౌదరి. తనను బ్యాన్‌ చేసే మొనగాడు లేడన్నారు. ఖమ్మం జిల్లాలో తనను పక్కన పెట్టినట్లు కొందరు ఊహించుకుంటున్నారని..తనను బ్యాన్‌ చేసేంత మొనగాడు ఇంకా పుట్టలేదన్నరామె. ఆ భ్రమల్లో ఎవరైనా ఉంటే వారి తిక్క త్వరలోనే వదులుతుందంటూ తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు. రేణుకా చౌదరి కామెంట్స్‌పై భట్టి విక్రమార్క అనుచరులు కూడా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ఏ మాత్రం బలం, అనుచర వర్గం లేని రేణుకా చౌదరి నోటికొచ్చినట్లు విమర్శలు చేసి పార్టీని, మంత్రులను ఇబ్బంది పెడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. తాము కూడా పీసీసీ, సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ అటాకింగ్‌కు దిగుతున్నారు భట్టి అనుచరులు. ఇటు భట్టి, అటు రేణుకా చౌదరి వర్గం ఢీ అంటే ఢీ అంటుండటంతో అధికార పార్టీలో చిచ్చును ఆసక్తికరంగా గమనిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.

Also Read: నిరుద్యోగులకు TGPSC గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు గరిష్ట వయోపరిమితి ఏకంగా పదేళ్లు పెంపు