Madhava Reddy Donthi: దొంతి మాధవరెడ్డి మంత్రి పదవికి అడ్డుపడుతోంది ఎవరు..?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు.. మంత్రి పదవిపై భారీగా ఆశలు పెంచుకున్నారు. బెర్త్ కోసం అటు హస్తిన చుట్టూ.. ఇటు సీఎం రేవంత్ చుట్టూ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు.

  • Updated on- May 30, 2026 / 01:19 AM IST
  • అంతా ఒకటై మంత్రి పదవికి అడ్డుపడుతున్నారనే ఫీలింగ్‌..
  • మంత్రి పదవి ఆశలపై నీళ్లు జల్లుతున్నారనే ఆవేదన!
  • మాధవరెడ్డి పదవికి అడ్డు పడుతోంది ఎవరు ?
  • దొంతి మాధవరెడ్డి ఇప్పుడేం చేయబోతున్నారు ?

Madhava Reddy Donthi: అందరూ ఒకవైపు.. తాను ఒకవైపు.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇదే ఫిక్స్ అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ప్రచారం వేళ.. ఆయన లోలోపల మదనపడుతున్నారట. అమాత్య పదవిపై ఆశలు పెట్టుకుంటే.. నీళ్లు జల్లుతున్నారని ఫీల్ అవుతున్నారట. ఇంతకీ ఆయన మంత్రి పదవికి అడ్డు వచ్చేది ఎవరు.. తన చుట్టూ ఎలాంటి రాజకీయం నడుస్తోందని మాధవరెడ్డి ఫీల్‌ అవుతున్నారు.. ఇప్పుడేం చేయబోతున్నారు.. ఓరుగల్లు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్‌. మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు.. మంత్రి పదవిపై భారీగా ఆశలు పెంచుకున్నారు. బెర్త్ కోసం అటు హస్తిన చుట్టూ.. ఇటు సీఎం రేవంత్ చుట్టూ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. మంత్రిపదవి కోసం.. ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌ రెడ్డి లాంటి నేతలు కొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు.

32 ఏళ్లుగా ఓరుగల్లుకు చెందిన రెడ్డి సామాజికవర్గ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని.. ఈసారి ఆ లోటు భర్తీ చేయాలని అంటున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అయితే.. సీఎం రేవంత్‌తో సహా.. సీనియర్ నేతలు, అధిష్టానం ముందు సరికొత్త వాదనలు తీసుకొస్తున్నారట. సీతక్క, కొండా సురేఖకు కేబినెట్‌లో స్థానం కల్పించడంపై.. పార్టీని స్ట్రాంగ్ చేయడంలో వాళ్ల మీద మీద చర్చ పెడుతూ సరికొత్త పాయింట్ తెరమీదకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని టాక్‌.

మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు..

నిజానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి.. ప్రభుత్వ ఏర్పాటు వరకు.. రేవంత్‌తో అంటీముట్టనట్లే కనిపించారు మాధవరెడ్డి. ఐతే సీఎంతో సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని నియోజకవర్గ శ్రేణుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. రేవంత్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మాధవరెడ్డి తల్లి చనిపోయినప్పుడు.. సీఎం రేవంత్ పరామర్శకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్‌ తగ్గిపోయింది. సీఎంను తీసుకొచ్చి మరీ.. తన సొంత నియోజకవర్గంలో మాధవరెడ్డి సభ నిర్వహించారు. అయినా సరే.. ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.

ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు స్ట్రాంగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య.. సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి నుంచి అనూహ్య పరిణామం, ప్రతిపాదన ఎదురైందట. ఏదైనా కార్పొరేషన్‌ కానీ.. డిప్యూటీ కేబినెట్ హోదాతో ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి కానీ ఆఫర్ చేయగా.. మాధవరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తనకు మంత్రి పదవి రాకుండా సైడ్ చేస్తున్నారనే అభిప్రాయం..

ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన ఓ నేత.. తనకు మంత్రి పదవి రాకుండా పక్కన పెడుతున్నారని దొంతి మాధవరెడ్డి మదన పడిపోతున్నారట. ఆయన ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందోనని.. తనకు మంత్రిగిరి రాకుండా సైడ్ చేస్తున్నారని మాధవరెడ్డి గట్టి అభిప్రాయంతో ఉన్నారట. బీసీ, ఎస్టీ వర్గాలకు మంత్రి పదవులు దక్కాయని.. వేం నరేందర్ రెడ్డి కీలక హోదాలో ఉన్నారనే లెక్కలు వేస్తూ పార్టీలో, సీఎం రేవంత్ కోటరీలో.. సదరు నేత చర్చకు తీసుకొస్తున్నట్లు దొంతి భావిస్తున్నారని తెలుస్తోంది. తాను డిమాండ్ చేస్తున్న రెడ్డి కోటాను.. ఎంపీ వేం నరేందర్‌తో లెక్క కట్టడం.. కార్పొరేషన్ గిరి తెరమీదకు తీసుకురావడం.. మాధవరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. సుదీర్ఘకాలంగా తనతో పడని నేతలంతా ఒక్కటయ్యారని.. తనకు అవకాశం దక్కకుండా చేస్తున్నారని.. దొంతి మాధవరెడ్డి ఫీల్‌ అవుతున్నారట.

తన మార్క్‌ పాలిటిక్స్‌ చూపించేందుకు రెడీ..

తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని భావిస్తున్న మాధవరెడ్డి.. సైలెంట్‌గా తన మార్క్‌ పాలిటిక్స్‌ చూపించేందుకు రెడీ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌ నేతల ఆధ్వర్యంలో జరిగిన వేం నరేందర్ రెడ్డి సన్మాన కార్యక్రమానికి.. పొంగులేటి, ఉత్తమ్‌ సమీక్షకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. ఇక అటు తన కుమారుడు అవియుక్త్‌ రెడ్డికి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనో.. సహకార సంఘాల ద్వారానో.. రంగప్రవేశం చేయించి తన కుమారుడిని జిల్లా స్థాయి పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారట మాధవరెడ్డి. వ్యతిరేక వర్గం తన అవకాశాలను దెబ్బతీస్తోందని.. తనకు, తన కుమారుడికి ప్రజాక్షేత్రమే రాజకీయ రాచబాట వేస్తుందనే ఫిలాసఫీతో ఉన్నారట.

Also Read: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీలు… భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్‌ పాలిటిక్స్‌