Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)
Vem Narender Reddy: ఆయన కోసం ఈయన..ఈయన కోసం ఆయన. జైలుకే వెళ్లినా..దరిదాపుల్లో కూడా రాజకీయ భవిష్యత్‌పై ఆశలు లేని టైమ్‌లో తలపడి నిలబడ్డారు సీఎం రేవంత్. అయితే తన కోసం ఒక అడుగు ముందుకేసి చిక్కుల్లో పడ్డ ఆప్తుడి కోసం వేం నరేందర్‌రెడ్డి కూడా ఎంతో తపించారు. రక్త సంబంధం లేకున్నా అన్నదమ్ముళ్లకు మించి..ఆప్తమిత్రుల కంటే ఎక్కువగా ఒకరికొకరు తోడునీడగా ఉంటూ వచ్చారు. అన్నీ తానై చక్కబెడుతూ వస్తున్న తన ఆత్మీయుడికి ఎట్టకేలకు రాజ్యసభ సీటు ఇప్పించుకున్నారు ముఖ్యమంత్రి. వైఎస్సార్‌కు కేవీపీ.. రేవంత్‌కు వేం నరేందర్‌రెడ్డి..ఇలా ఫిక్స్ అయిపోవచ్చా?
ఎట్టకేలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. ఒక సీటులో అభిషేక్ సింఘ్వీకి రెన్యూవల్ చేస్తే..రెండోసీటును ఎవరికి ఇస్తారన్నది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్‌గా కొనసాగింది. ఫైనల్‌గా సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. రెండో సీటు కోసం కాంగ్రెస్‌లోని హేమా హేమీలందరూ పోటీపడ్డారు. దాదాపు 16 మంది నేతలు రేసులో నిలువగా..పెద్దల సభకు వెళ్లేందుకు రాష్ట్రస్థాయి నేతలు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకరిద్దరు నేతలు ఏకంగా ప్రియాంక గాంధీ ద్వారా కూడా లాబీయింగ్ చేశారు. కానీ ఈ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో తనకు నమ్మకమైన..తనకు తోడు నీడగా ఉంటే నేతకు ఇప్పించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారట.
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పటి నుంచి వేం నరేందర్‌రెడ్డి రేవంత్‌కు చాలా సన్నిహితుడు. ఈ క్రమంలోనే 2015లో వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ చేయని ప్రయత్నాలు లేవు. వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచేందుకు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు సరిపోకపోవడంతో..బీఆర్ఎస్ సభ్యులకు ఆయన గాలం వేశారని..ఈ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఎరవేశారన్న ఆరోపణలతో ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లారు. అయితే తనను ఎమ్మెల్సీ చేయాలని తాపత్రయ పడి రేవంత్ చిక్కుల్లో పడటం..ఆయన రాజకీయ జీవితం ఆగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో వేం నరేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదన అనుభవించారు.
అదే ఓటుకు నోటు కేసులో వేం నరేందర్‌రెడ్డి టార్గెట్‌గా కూడా విచారణ జరిగింది. ఆ కేసులో అటు రేవంత్, ఇటు వేం నరేందర్‌రెడ్డి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని..వాళ్లకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చెప్తుంటారు. అప్పటినుంచి వారిద్దరి ఎమోషనల్ బాండింగ్ ఇంకా పెరిగిపోయిందని అంటుంటారు. అయితే రేవంత్ తిరిగి తన రాజకీయ పోరాటం స్టార్ట్ చేయడం..ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడం..రేవంత్ వెంటే తానంటూ వేం నరేందర్ ఆయనతో కలిసి ప్రయాణించడం జరిగిపోయాయి. ఫైనల్‌గా కాంగ్రెస్‌లో రేవంత్ సీఎం అయ్యారు. ఆయనకు ఆప్తుడిగా ఉన్న వేం నరేందర్ రాజకీయ సలహాదారుగా అన్నీ తానై చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపించాలని ఫిక్స్ అయిన రేవంత్..కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించి..మెప్పించి..అందరి అంచనాలను తలకిందులు చేసి తన మిత్రుడిని పెద్దల సభకు పంపేందుకు రూట్ క్లియర్ చేసుకొచ్చారు.
అభిషేక్ సింఘ్వీకి ఆల్రెడీ ఒక సీటు కన్ఫామ్ అయినందున రెండో సీటు కోసం స్వయంగా ప్రియాంక గాంధీ..ఒక వ్యక్తి కోసం ప్రయత్నం చేసినా..సీఎం మాత్రం చాకచక్యంగా వేం నరేందర్‌రెడ్డికి ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక కావడంతో..తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ రామచందర్‌రావు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలన్నీ కేవీపీ కనుసన్నల్లోనే జరిగేవి. ప్రభుత్వంలో పొలిటికల్ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టే వారు. స్వయంగా వైఎస్సే..కేవీపీని కలవాలంటూ సూచించే వారు. అలా అప్పట్లో కేవీపీని కలిస్తే చాలు అనుకునే వారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ నెంబర్ -2గా ఉండేవారు.
ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి సేమ్ ఆత్మలా ఉంటున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో రాజకీయ వ్యవహారాలన్నీ వేం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ అంశాలన్నీ కూడా వేం నరేందర్‌కు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి..సీఎంకు పొలిటికల్ ప్రెజర్ లేకుండా చూసుకోగలుగుతున్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటూ వస్తున్నారు. ఇలా తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వేంను..వైఎస్సార్ హయాంలో కేవీపీ మాదిరిగా..మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారట.
ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం..పొలిటికల్ వ్యవహారాలన్నీ ఢిల్లీ స్థాయిలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డిని ఢిల్లీలో యాక్టీవ్ చేస్తే..ప్రతీదానికి తాను ఫోకస్ పెట్టాల్సిన పని ఉండదని భావించారట. అందుకే పట్టుబట్టి తన మాట నెగ్గించుకుని ఆత్మీయుడిని రాజ్యసభకు పంపుతున్నారట. వేం నరేందర్ రెడ్డి ఎపిసోడ్‌తో..కాంగ్రెస్‌లో పాత సమీకరణాలు సాంప్రదాయం తెరపైకి వస్తుంది. వేం నరేందర్ రెడ్డి సేమ్ కేవీపీ రోల్‌నే పోషిస్తారా అనేది చూడాలి మరి.
Also Read: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ఉద్యోగుల జీతం మూడింతలు? అసలు ఫార్ములా ఇదే!