Telangana Politics: డీలిమిటేషన్‌పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?
పునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది.
- Naveen
- Published On : March 25, 2026 / 09:53 PM IST
Telangana Politics: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఎవరో డిసైడ్ చేసేది ఆ రెండు జిల్లాలేనా? గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు గెలిచిన వారికే పవర్ దక్కనుందా? నెక్స్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు జిల్లాలే చుట్టే తిరగనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే అత్యధికంగా అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని అంచనా. అదే జరిగితే ఆ రెండు జిల్లాలే తెలంగాణలో పవర్ ఎవరిదో డిసైడ్ చేసే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండటంతో కొత్త తరం నాయకులు తెరపైకి వస్తున్నారు. నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్ల తర్వాత టికెట్ కోసం ఎదురుచూస్తున్న లీడర్లకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 179కు, లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనుంది. దీంతో కొత్తగా 60 సెంబ్లీ సీట్లు, 9 లోక్‌సభ సీట్లు ఏర్పడనున్నాయి.
టికెట్ పొందలేకపోయిన నేతల్లో చిగురిస్తున్న ఆశలు..
ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాతుకుపోయి ఉండటం, వారిని ఆ స్థానం నుంచి కదిలించడం పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పుడు పునర్విభజనతో సీనియర్లు, ఇతర కారణాలతో గతంలో టికెట్ పొందలేకపోయిన నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు దామాషా పద్దతిలో మంత్రుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం క్యాబినెట్‌లో సీఎం సహా 18 మందికే అవకాశముండగా..రాష్ట్రంలో 179 మంది ఎమ్మెల్యేలకుగాను సీఎం సహా 27 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సీట్లు పెరుగుతాయని అంచనా
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఉమెన్ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే సీన్ మరింత మారనుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కి పెరగనుండగా..అందులో 60 సీట్ల దాకా మహిళలకే రిజర్వ్ కానున్నాయి. అలాగే 7 పార్లమెంటు సీట్లూ రిజర్వ్ కానున్నాయి. పైగా నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సగటున 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లిలో 7.32 లక్షలు, ఉప్పల్‌లో 4.54 లక్షలు, మల్కాజ్‌గిరిలో 4.30లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు..
పునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది. అలాగే సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోనూ పరిమితికి మించి ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 8 నుంచి 10 వరకు కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 2 నుంచి 4 లోక్ సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకూ చేరుకోవచ్చు. డీలిమిటేషన్‌తో 179 నియోజకవర్గాలు అయితే..అందులో అత్యధికంగా 59 నియోజకవర్గాలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉండనున్నాయి. ఇదే జరిగితే ఇక్కడ మెజార్టీ సాధించిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓల్డ్ సిటీ సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం ప్రభావం కొంతమేర తగ్గే ఛాన్స్ ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే.. రాజకీయంగా లాభం ఎవరికి.. నష్టం ఎవరికి?
