IAS Rohini Sindhuri: కర్నాటకలో హడలెత్తిస్తున్న తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్.. ఎవరీ రోహిణి సింధూరి? ఎందుకు కాంట్రవర్సీగా మారుతున్నారు?

సిన్సియర్‌గా పనిచేసే ఐఏఎస్‌లకు.. పొలిటికల్ ప్రెజర్స్..ట్రాన్స్‌ఫర్స్ కామన్. రోహిణి సింధూరి విషయంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చాయి. గతంలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌తో కోల్డ్ వార్ నడిచి రచ్చకెక్కింది.

  • Published On : April 7, 2026 / 10:50 PM IST
  • మరోసారి వార్తల్లో ఐఏఎస్ రోహిణి సింధూరి
  • కర్ఱాటకలో హడలెత్తిస్తున్న తెలంగాణకు చెందిన రోహిణి
  • కర్ఱాటక అడ్మినిస్ట్రేషన్‌లో సిన్సియారిటీకి, వివాదాలకు కేరాఫ్‌గా రోహిణి
  • సిన్సియర్, నాన్ కరప్ట్ ఆఫీసర్‌గా పేరున్నా వెంటాడుతున్న కాంట్రవర్సీలు
  • నో కాంప్రమైజ్..నో రెకమండేషన్స్ అంటూ హల్చల్
  • లేటెస్ట్‌గా రోహిణి సింధూరిపై కరప్షన్ అలిగేషన్స్..!
  • రోహిణిపై అవినీతి ఆరోపణల వెనుక ఓ మాజీ మంత్రి?

 

IAS Rohini Sindhuri: నాన్ కరప్ట్. సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణకు చెందిన ఆ మహిళా అధికారి కర్ణాటక అడ్మినిస్ట్రేషన్‌లో ఎప్పటినుండో కీలకంగా ఉన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలను, ఒత్తిళ్లను లైట్ తీసుకుంటూ సర్వీస్ మ్యాన్యువల్స్‌ను ఫాలో అవుతూ ఎవరికీ తలవంచడం లేదు. దీంతో ఆమె వరుసగా వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టే..బోలెడంత చర్చ..రచ్చ జరుగుతోంది. ఇంతకు కర్ణాటకలో ఖతర్నాక్ అధికారిగా మారిన ఆ మహిళ ఐఎఎస్ ఎవరు? ఆమెపై వస్తున్న ఆరోపణలకు కారణమేంటి? ఎందుకు ఆ ఆఫీసర్ కాంట్రవర్సీగా మారుతున్నారు?

రోహిణి సింధూరి. కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళా అధికారి..అంతేస్థాయిలో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ..నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు. నాన్ కరప్ట్ ఆఫీసర్‌గా..సిన్సియర్ ఐఏఎస్‌గా పేరున్న రోహిణి..మన పక్కనున్న కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్‌ అధికారి. తెలంగాణకు చెందిన ఆమె..ఐఏఎస్‌గా సెలెక్ట్ అయి..కర్ణాటక క్యాడర్‌లో పని చేస్తున్నారు. మంచి డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రోహిణిని..ఎప్పుడూ ఏదో ఒక పొలిటికల్ కాంట్రవర్సీ న్యూస్ హెడ్ లైన్‌గా మార్చుతుంది.

ఐఏఎస్ రోహిణి సింధూరిని ఇరికించే స్కెచ్..!

లేటెస్ట్‌గా ఎకో-బ్యాగుల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయంటూ..ఇందులో కోట్లాది రూపాయల స్కాం జరిగిందనే ఆరోపణలను ఫేస్ చేస్తున్నారమె. ముఖ్యంగా కర్ణాటక పొలిటిక్స్‌లో బలమైన నేతగా ముద్రపడిన జేడీఎస్ నేత, ఓ మాజీమంత్రి దీని వెనుక ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎకో-బ్యాగ్ కొనుగోళ్ల స్కామ్ అంటూ సదరు జేడీఎస్ నేత..ఐఏఎస్ రోహిణి సింధూరిని ఇరికించే స్కెచ్ వేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఐఏఎస్‌ను టార్గెట్ చేయడానికి గల కారణం లేకపోలేదనే చర్చ కూడా అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఐఏఎస్ రోహిణి సింధూరి ఒక డైనమిక్ ఆఫీసర్. మైసూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కాలంలో రోహిణి తన డైనమిజంతో అధికార పార్టీ నేతల విషయంలో కూడా నిక్కచ్చిగా వ్యవహరించారు. కన్నడ పాలిటిక్స్‌లో ముఖ్యంగా జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలో బలమైన నేతగా..ఆర్థికంగా బలవంతుడైన లీడర్‌ను అప్పట్లో రోహిణి లైట్ తీసుకున్నారట. మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్‌కు తలొగ్గకుండా…సదరు జేడీఎస్ నేత చేసిన ఇల్లీగల్ పనులన్నింటికి చెక్ పెట్టారట. ల్యాండ్ గ్రాబింగ్, ఎన్‌క్రోచ్ మెంట్ల విషయంలో ఐఏఎస్ రోహిణి ఖరాఖండిగా వ్యవహరించారట.

ఐఏఎస్ రోహిణి వల్లే తన పొలిటికల్ కెరీర్ దెబ్బతిందనే కక్షతో..!

ముఖ్యంగా రాజకాలువ, గోశాల ల్యాండ్‌ను ఆక్రమించి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించడంపై కేసు నమోదు చేయడమే కాకుండా దానిపై దర్యాఫ్తునకు కూడా ఆదేశించారట. ఈ ల్యాండ్ స్కామ్‌లో ఏకంగా ఓ జేడీఎస్ నేత పేరును ప్రస్తావించి..ప్రభుత్వ విచారణ చేయాలని ఆదేశించారట. దీంతో వరుసగా మూడుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న సదరు జేడీఎస్ నేత..రోహిణి సింధూరి పనితీరును డైజెస్ట్ చేసుకోలేకపోయారట. తన మాటకే ఎదురు చెప్పి..పైగా తన మీదే విచారణకు ఆదేశిస్తారా అని ఆగ్రహంతో రగిలిపోయారట. ఈ ఆరోపణల తర్వాత జరిగిన 2023 కర్ణాటక ఎన్నికల్లో ఆ జేడీఎస్ నేత ఓడిపోయారు. దీంతో ఐఏఎస్ రోహిణి వల్లే తన పొలిటికల్ కెరీర్ దెబ్బతిందనే కక్షతో..రోహిణి టార్గెట్‌గా సదరు మాజీ మంత్రి ఇప్పుడు ఆరోపణల పరంపర ఎక్కు పెడుతున్నారనే టాక్‌ నడుస్తోంది. ఆ ఇష్యూ తర్వాతే రోహిణిపై అనేక ఆరోపణలు, వివాదాలు వస్తుండటం విశేషం.

మైసూరు కలెక్టర్‌గా ఉన్న సమయంలో పర్యావరణాన్ని కాపాడటం కోసం రోహిణి ఎకో-ఫ్రెండ్లీ కాటన్ బ్యాగ్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. పాలిథిన్ కవర్స్‌ కాకుండా జూట్ బ్యాగులను వాడాలని నిర్ణయించారు. అయితే ఈ ఎకో-ఫ్రెండ్లీ బ్యాగుల విషయంలో స్కాం జరిగిందంటూ ఆ జేడీఎస్ నేత ఆరోపణలు చేస్తున్నారు. 13 రూపాయల బ్యాగ్‌ను 52 రూపాయలుగా ధర చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారంటూ అలిగేషన్స్ గుప్పించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ..ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా హైకోర్టులో కేసు వేయించారు. దీంతో ఇప్పుడు కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌లో..తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఐఏఎస్ రోహిణి నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే జేడీఎస్ నేత కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్ ల ఎపిసోడ్‌లో..బ్యాగుల సరఫరా జరగలేదు..చెల్లింపులు కూడా జరగలేదట. రోహిణి మైసూరు కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఈ బ్యాగులు పంపిణీ చేయలేదట. అలాగే ఆమె కలెక్టర్‌గా ఉన్న టైమ్‌లో ఎలాంటి పేమెంట్స్ కూడా చేయలేదట. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే.. బ్యాగులను ప్రభుత్వ రంగం సంస్థ అయిన కర్ణాటక హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచే కొనుగోలు చేశారట. రోహిణి హయాంలో జరగకపోయినా..కొనుగోలు వ్యవహారం అంతా కూడా డిస్ట్రిక్ కలెక్టర్ కార్యాలయం నుంచి మరో ప్రభుత్వ సంస్థ మధ్యనే పేమెంట్స్ జరిగాయి. రెండు ప్రభుత్వ సంస్థల మధ్య జరిగే లావాదేవీలు కుంభకోణానికి ఎలా దారి తీస్తాయనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అంతేకాదు సదరు జేడీఎస్ నేత చెబుతున్నట్లుగా బ్యాగ్ ధర 13 రూపాయలనేది కూడా ఒక ఫాల్స్ అలిగేషన్ అని కొట్టి పారేస్తున్నారు.

ఎన్ని అలిగేషన్స్ వచ్చినా తగ్గేదే లే అంటున్న ఐఏఎస్..

సిన్సియర్‌గా పనిచేసే ఐఏఎస్‌లకు.. పొలిటికల్ ప్రెజర్స్..ట్రాన్స్‌ఫర్స్ కామన్. రోహిణి సింధూరి విషయంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చాయి. గతంలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌తో కోల్డ్ వార్ నడిచి రచ్చకెక్కింది. ఇదే జేడీఎస్ నేత కరోనా టైమ్‌లో రోహిణి సింధూరి విధుల్లో నిర్లక్ష్యం చేశారని, అవినీతి చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇక ఓ ఎంపీతోనూ గతంలో రోహిణి సింధూరికి గొడవలు జరిగాయి. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి వార్తల్లో నిలిచారు. ఇలా తనపై ఎన్ని అలిగేషన్స్ వచ్చినా ఎక్కడా తగ్గకుండా..వివాదాలతో పాటు పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి..తనకంటూ ఓ ట్రాక్ రికార్డు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు.

ఆరోపణల్లో నిజం లేదంటున్న కుటుంబసభ్యులు..

రోహిణి ఆధ్వర్యంలో 2014లో ఒక్క ఏడాదిలోనే మాండ్య జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎకో బ్యాగుల స్కామ్ అంటూ వస్తున్న అలిగేషన్స్ కూడా ఉట్టివేనంటూ కొట్టిపారేస్తున్నారు ఆమె కుటుంబసభ్యులు. ఈ వ్యవహారంపై కోర్టులో పోరాటం సాగించి తాడోపేడో తేల్చుకునేందుకు రోహిణి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారితీస్తుందో చూడాలి.

Also Read: ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్..