Mohammad Azharuddin: ఇక నెల రోజులే.. సిక్స్ కొడతారా డకౌట్ అవుతారా? మినిస్టర్ అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి..
ఈ విషయంపై రేవంత్ సర్కార్ సీరియస్‌గా ఉంది. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా లేకపోతే... ప్లాన్ B అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Naveen
- Published On : March 30, 2026 / 11:29 PM IST
- అజార్ మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా?
- ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడిగా లేని అజారుద్దీన్..
- ఇంకా పెండింగ్‌లోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్…
- ఏప్రిల్ 30లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఉంటేనే పదవి..
- ఫైల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంటే.. అజార్ పరిస్థితేంటి ?
- అజార్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధం చేసిన ప్లాన్ B ఏంటి?
Mohammad Azharuddin: మిగిలింది నెల రోజులే ! ఈలోపే ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. ఫైల్ ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది.. మరి ఇప్పుడెలా.. ఏం జరగబోతోంది. మినిస్టర్ అజ్జూ భాయ్ ఫ్యూచర్ ఏంటి.. కాంగ్రెస్ రెడీ చేసిన ప్లాన్ ఏంటి.. ఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజారుద్దీన్.. ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. కేబినెట్ ఆమోదించిన ఫైల్.. గవర్నర్ దగ్గరే ఉంది. టైమ్ మాత్రం ఇంకా 30 రోజులే ఉంది. ఫైల్ ఇలానే గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంటే.. ప్లాన్ B ఆలోచన చేస్తుందట సర్కార్.
అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. దీనికి కారణం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడమే ! ఏ చట్టసభల్లో సభ్యుడిగా లేకపోయినా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా అజారుద్దీన్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తూ రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే ఉంది. మంత్రి పదవి కొనసాగాలంటే.. ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో అజారుద్దీన్‌కు సభ్యత్వం తప్పనిసరి. ఐతే వచ్చే నెల 30వ తేదీతో.. ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తుంది. ఇంకా 30 రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో.. ఇప్పుడేం జరగబోతుందనేది ఆసక్తి రేపుతోంది. గవర్నర్ దగ్గర ఫైల్ ఇలానే పెండింగ్‌లో ఉంటే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఐతే దీనికి రేవంత్ సర్కార్ ప్లాన్ బీ సిద్ధం చేసిందనే టాక్ నడుస్తోంది.
మంత్రి పదవి విషయంలో ఏం జరగబోతుంది?
అక్టోబర్ 31న తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి 6 నెలల లోపు చట్టసభల్లో సభ్యుడు కావాలి. అంటే ఏప్రిల్ 30లోపు ఆయన చట్టసభల్లో సభ్యుడు కావాలన్న మాట. నాలుగు నెలల కిందటే.. కేబినెట్ ఆమోదించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్‌ను నామినేట్ చేసింది. ఐతే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఈ మధ్యే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మరోసారి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే.. హైకోర్టుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది.
ప్లాన్ B అమలుకు ప్రభుత్వ పెద్దలు రెడీ..
ఈ మధ్యే రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు. దీంతో మరోసారి గవర్నర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారం గవర్నర్‌తో భేటీ అయి.. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరనున్నట్లు సమాచారం. మళ్లీ కోర్టుకు వెళ్తే ఆలస్యం అవడం తప్ప.. వచ్చే లాభం లేదని, వీలైనంత త్వరగా ఫైల్ క్లియర్ చేయాలని గవర్నర్‌ను ప్రభుత్వ పెద్దలు కోరనున్నారట. ఐతే సాంకేతిక కారణాలతో ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో పెడితే మాత్రం.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి గండం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీంతో ప్రభుత్వ పెద్దలు ప్లాన్ B అమలు చేసేందుకు రెడీ అవుతున్నారట. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే.. అజారుద్దీన్ చేత రాజీనామా చేయించి.. మే రెండో వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో మరోసారి అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నారని టాక్.
అజారుద్దీన్ సిక్స్ కొడతారా.. డకౌట్ అవుతారా..
ఓవరాల్‌గా లాస్ట్ బాల్‌కు అజారుద్దీన్ సిక్స్ కొడతారా.. డకౌట్ అవుతారా అనేది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక అటు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయ్. ఇలాంటి సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి దూరం అయితే.. కాంగ్రెస్‌కు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయంపై రేవంత్ సర్కార్ సీరియస్‌గా ఉంది. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా లేకపోతే… ప్లాన్ B అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: ఆ మంత్రినే బీఆర్ఎస్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది? అసలు వ్యూహం ఏంటి..
