BRS: ఆ మంత్రినే బీఆర్ఎస్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది? అసలు వ్యూహం ఏంటి..
పొంగులేటి టార్గెట్‌గా బీఆర్ఎస్ చూపిస్తున్న దూకుడు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అసలు పొంగులేటి మీద ఈ రేంజ్‌లో ఎందుకు ఫోకస్ చేస్తుందనే డిస్కషన్ నడుస్తోంది.
- Naveen
- Published On : March 30, 2026 / 09:03 PM IST
- అసెంబ్లీలో.. బయటా.. గులాబీ పార్టీ ఫోకస్..
- అక్రమ మైనింగ్ అంటూ బీఆర్ఎస్ ఫైర్…
- పొంగులేటిని మంత్రిగా బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- పొంగులేటిపై గవర్నర్ కు కూడా బీఆర్ఎస్ ఫిర్యాదు..
- పొంగులేటిని ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది ?
BRS: మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న విధానం.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఆ మంత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ఆయన అక్రమాలు బయటపెట్టే తీరుతామని గులాబీ పార్టీ అంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేవరకు పోరాటం చేస్తామని చెప్తోంది. అసలు మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది.. అసెంబ్లీలో రెండు రోజులు ఆందోళన చేసిన గులాబీ పార్టీ.. బయట కూడా ఎందుకు ఫోకస్ చేస్తోంది.. అసలు వ్యూహం ఏంటి..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ.. అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దీనిపై బీఆర్‌ఎస్ భారీ పోరాటం చేస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై.. హౌస్ కమిటీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కారు పార్టీ డిమాండ్ చేస్తోంది. మంత్రి పొంగులేటిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని.. అక్రమంగా నడుస్తున్న క్రషర్ యూనిట్లను సీజ్ చేయాలని పట్టుబట్టింది బీఆర్ఎస్.
రాజేంద్రనగర్ మండలం కొత్వాల్‌గూడ మానస హిల్స్ ప్రాంతంలో.. ఎలాంటి అనుమతులు లేకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్ యూనిట్లను నడుపుతోందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. దీనికి పర్యావరణ అనుమతులు లేవని.. జీవో నంబర్ 111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని గులాబీ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తోంది. క్రషర్ వ్యవహారంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో ఓ నిజ నిర్ధారణ కమిటీ వేసింది బీఆర్ఎస్. మానసా హిల్స్‌లోని క్రషర్ ప్రాంతాన్ని ఈ కమిటీ రెండుసార్లు సందర్శించింది కూడా !
సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణ..
ఐతే తాము ఏర్పాటు చేసిన నిజ నిర్థారణ కమిటీ పర్యటనకు ముందే.. అక్కడున్న కంటైనర్లపై రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పేర్లను చెరిపేసి.. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇదే అంశాన్ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ లేవనెత్తింది. ఈ అంశంపై గులాబీ పార్టీ నేతలు రెండు రోజులపాటు నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్ అక్రమ మైనింగ్‌పై చర్చకు సీరియస్‌గా పట్టుబట్టారు. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులు సస్పెండ్ చేశారు.
అంతకుముందు కేటీఆర్, హరీశ్ నేతృత్వంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ వ్యవహారం.. రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ఐతే బీఆర్ఎస్ ఆరోపణలను.. సీఎం రేవంత్ తిప్పికొడుతున్నారు. గత 12ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ లీజుల అక్రమాలను కూడా బయటపెడతామని సవాల్ విసిరారు. అటు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు కూడా.. ఆరోపణలను తోసి పుచ్చారు. తాము కేవలం ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిబంధనల ప్రకారమే పని చేస్తున్నామని.. రాజకీయ కక్షతోనే తమపై బురద జల్లుతున్నారని అంటున్నారు.
పొంగులేటి మీద ఈ రేంజ్‌లో ఎందుకు ఫోకస్..?
పొంగులేటి టార్గెట్‌గా బీఆర్ఎస్ చూపిస్తున్న దూకుడు.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అసలు పొంగులేటి మీద ఈ రేంజ్‌లో ఎందుకు ఫోకస్ చేస్తుందనే డిస్కషన్ నడుస్తోంది. ఐతే పొంగులేటి ఇష్యూను.. బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకోవడం వెనక బలమైన కారణం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక అవకతవకలు జరిగాయని.. వివిధ శాఖల్లో సుమారు 19 స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తున్న కారు పార్టీ.. వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఐతే వీటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. ఇలాంటి సమయంలో మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ క్రషర్ వ్యవహారం.. కారు పార్టీకి ఆయుధంగా మారింది. ఆ క్రషర్‌కు అనుమతులు లేవని చెప్పడానికి.. పలుమార్లు నోటీసులు జారీ చేయడం, జరిమానా విధించడానికి సంబంధించి పూర్తి ఆధారాలు దొరికాయ్. దీంతో ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదలొద్దని బీఆర్ఎస్ డిసైడ్ అయిందని టాక్.
వదిలేదే లే అనే రేంజ్‌లో పొంగులేటి టార్గెట్..
మంత్రి పొంగులేటి కుటుంబసభ్యులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్న వట్టినాగులపల్లి భూములను.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్, హరీశ్‌రావు స్వయంగా సందర్శించారు. ఆ తర్వాత లోక్‌భవన్ వెళ్లి.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి అక్రమ క్రషర్లు నడుపుతున్నారని.. హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అటు అసెంబ్లీలో.. ఇటు బయటా.. ఇలా వదిలేదే లే అనే రేంజ్‌లో పొంగులేటిని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. ఈ అంశాన్ని ప్రభుత్వంపై ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ వాడుతుంటే.. పాత ప్రభుత్వ అక్రమాలతో ముడిపెట్టి కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో రాజకీయ రచ్చ రోజురోజుకు ముదురుతోంది.
