Gossip Garage: అపోజిషన్‌లోకి వచ్చినప్పటి నుండి ఆయన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్దామనుకున్నారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగా హస్తం పెద్దలతో భేటీలు..దగ్గరయ్యేలా డైలాగులూ పేల్చారు. ఇంట్లో శుభకార్యాలకు సైతం ప్రభుత్వ పెద్దలను ఇన్వైట్ చేసి పెద్ద పీటే వేశారు. కారణాలేమైనప్పటికీ హస్తం గూటికి చేరేందుకు మల్లన్నకు లైన్ క్లియర్ కాలేదట. దాంతో కారులోనే కంటిన్యూ అవుతున్న మల్లారెడ్డి చూపు కమలం మళ్లిందనే టాక్ నడుస్తోంది. బిజినెస్ మ్యాన్ నుండి పొలిటిషియన్ అవతారం ఎత్తిన మేడ్చల్ మల్లన్న దారెటు? ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమా? కారులోనే సర్దుకుపోతారా..?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన గులాబీ పార్టీలో ఉన్నా చూపంతా పక్క పార్టీలపైనే ఉందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. తన సన్నిహితుల ద్వారా ప్రయత్నం కూడా చేశారనే టాక్ నడిచింది.
రెండు మూడు సందర్భాల్లో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరీ హస్తం పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి ట్రై చేశారనే చర్చ జరిగింది. ఎలా గెలుస్తావో చూస్తానంటూ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ ను తొడగొట్టి సవాల్ చేసిన మల్లన్న… ప్రతిపక్షంలోకి మారగానే రేవంత్‌రెడ్డిని తన మనవరాలు పెండ్లికి పిలిచి..మనవళ్లతో సీఎం కాళ్లు మొక్కించారు. లాస్ట్‌కు బెంగళూరుకు వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా కలిసి వచ్చారు మల్లారెడ్డి. అయినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్లియరెన్స్ రాలేదట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్న మల్లన్న..ఎంతో అవసరమైతే తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు.
ముందు కోడలిని బీజేపీలోకి పంపే ప్లాన్..!
అధికార కాంగ్రెస్‌లో చేరదామనుకుంటే సాధ్యం కాలేదు కాబట్టి కనీసం బీజేపీలోకైనా వెళ్దామని మల్లన్న భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన ఎంట్రీ కంటే ముందు తన కోడలు ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపేందుకు మల్లారెడ్డి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారని అంటున్నారు.
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు..
పాతబస్తీలో బోనాల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్‌లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారు ప్రీతిరెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ప్లాన్..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకున్నా తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. అప్పటి నుంచే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కొంత అసంతృప్తితో ఉంటూ వస్తున్నారట. ఇప్పుడు ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీవైపు అడుగులేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కి గ్యాప్ ఉందంటూ ప్రచారం జరుగుతుండటం..ఇద్దరి కోల్డ్ వార్ రచ్చకెక్కిన నేపథ్యంలో..గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించిన ప్రీతిరెడ్డితో బండి సంజయ్ భేటీ అవడం హాట్ టాపిక్ అవుతోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
ఈ రాజకీయ సమీకరణాల్లో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. బండి, ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్‌పై బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. టైమ్ చూసి మల్లారెడ్డి బీఆర్ఎస్‌ను వదిలి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి లేదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే యోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.
సేమ్ టైమ్ బీజేపీలోకి వెళ్తే తన విద్యాసంస్థలకు, బిజినెస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. కారులోనే ఉంటారా? కమలం గూటికి వెళ్తారా? అనేది మల్లారెడ్డి చెప్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. కారు గుర్తుపై మేడ్చల్, మల్కాజిగిరి నుండి గెలిచిన మామ, అల్లుళ్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి లు వచ్చే ఎన్నికల దాకా బీఆర్ ఎస్ లోనే కొనసాగినా… కోడలిను మాత్రం కమలదళంలో చేర్చడం ఖాయమనే టాక్ నడుస్తోంది.