Women Reservations: మహిళా రిజర్వేషన్లు.. భార్య, కూతుళ్లు, కోడళ్లను బరిలో దించేందుకు రెడీ అవుతున్న లీడర్లు ఎవరు?
మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో చాలామంది నేతలు..తమ వారసులైన మహిళామణులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- Naveen
- Published On : March 27, 2026 / 09:54 PM IST
- తెలంగాణలో 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు
- 33 శాతం రిజర్వేషన్లతో మహిళలకు 59 ఎమ్మెల్యే సీట్లు
- పోటీకి రెడీ అవుతున్న కీలక నేతల కుటుంబ సభ్యులు
- ఎన్నికల్లో పోటీకి డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని సై?
- కూతురు సుష్మితను బరిలోకి దింపనున్న కొండా దంపతులు!..
- ఎన్నికల బరిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మీ?
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
Women Reservations: నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ మారబోతోంది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పొలిటికల్ లీడర్లు అలర్ట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని భార్య, కూతుళ్లు, కోడళ్లను పోటీ చేయించేందుకు రెడీ అవుతున్నారు లీడర్లు. ఉమెన్ కోటాతో నేతల్లో చిగురిస్తున్న ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి? తమ వారసులను బరిలోకి దించేందుకు ఉవ్విళ్లూరుతున్న లీడర్లెవరు?
తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 179కి పెరగనుండటంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. దీంతో తెలంగాణలో మహిళలకు ఏకంగా 59 సీట్లు దక్కే అనకాశం ఉంది. మహిళలకు పెద్దఎత్తున అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానుండటంతో పొలిటికల్ లీడర్లు అలర్ట్ అవుతున్నారు.
పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబానికి రెండో సీటు కోసం ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో లీడర్ల వారసులకు ఎంట్రీకి ఈజీ కానుంది. చాలామంది నేతలు తమ భార్య లేదంటే కూతురు, కోడలును పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో కనీసం 25 మందికి పైగా ముఖ్యనేతలు తమ వారసులను వచ్చే ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు నేతల భార్యలు, కూతుళ్లు, కోడళ్ల ఆసక్తి..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ, మంత్రులు కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్, దామోదర రాజనర్సింహ కూతురు త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, మాజీమంత్రి జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య భార్య అనిత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి, ఈటల రాజేందర్ భార్య జమునతో పాటు మరికొందరు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం సీటును ఆశించారు. కానీ అప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమెకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుతో ఈ సారి కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారట మల్లు నందిని.
భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో మధిర నియోజకవర్గం బాధ్యతలను ఆయన భార్య నందిని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ఇప్పటికే రాజకీయాల్లో భర్తకు తోడుగా ఉంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆమె రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్న కోమటిరెడ్డి లక్ష్మి వారి బాగోగుల తెలుసుకుని..ఆపదలో ఆదుకుంటూ ప్రజలకు దగ్గరతువుతున్నారు. గతంలో తన సతీమణిని జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్సీ చేయడం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
కూతురు, కోడలిని బరిలో దించే యోచనలో మల్లారెడ్డి..
ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి.. అద్దంకి వెంట రాజకీయాల్లో చాలా కాలంగా నేరుగా పాల్గొంటున్నారు. ఈమె ఎస్టీ కావడంతో ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్యే అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో పాటు..మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి అయిన తన కూతురును పోటీ చేయించాలని భావిస్తున్నారట. మల్లారెడ్డి కొడుకులను మించి కోడలు ప్రీతిరెడ్డి ఎలివేట్ అవుతున్నారు. బీజేపీ నుంచి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే ప్రచారం సాగుతోంది.
ఇక మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఇప్పటికే తల్లితో పాటు తండ్రి కొండా మురళి వెంట పరకాల నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె పేరుతో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మిత పోటీ చేయడం ఖాయమని ఎమ్మెల్సీ కొండా మురళి ఇప్పటికే ప్రకటించారు. దామోదర రాజనర్సింహ కూతురు త్రిష కూడా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధోల్ నియోజకవర్గంలో జరిగే పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ఇప్పటికే అలయ్..బలయ్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక ఈటల రాజేందర్ భార్య జమున కూడా ఎప్పటి నుంచో పాలిటిక్స్‌లో యాక్టివ్‌గానే ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భార్య కూడా భర్త వెంటే రాజకీయం చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీమంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కోడలు చరిష్మా రెడ్డిని వారసురాలుగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెనే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావించినా..పౌరసత్వ వివాదంతో చివరి క్షణంలో కోడలు యశస్విని రంగంలోకి దింపి..అన్నీ తానై గెలిపించుకున్నారు.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో కోడలితో పాటు తాను కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో చాలామంది నేతలు..తమ వారసులైన మహిళామణులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్‌లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
