Ration Card : సర్కార్ సంచలన నిర్ణయం.. లక్షల రేషన్ కార్డులు రద్దు.. మీ కార్డు ఉందేమో చెక్ చేసుకొండి
Ration Card : ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లక్షలాది రేషన్ కార్డులను రద్దు చేసింది. కారణమేంటంటే..
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 08:12 AM IST
government orders ration card e kyc mandatory aadhaar linking to prevent cancellation
- రేషన్ కార్డుదారులకి అలర్ట్
- ఈకేవైసీ, ఆధార్ లింకింగ్ తప్పనిసరి
- లేదంటే కార్డులు రద్దు
Ration Card : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఈ క్రమంలో సర్కార్ రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు వినియోగదారులందరూ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అర్హులైన లబ్ధిదారులు తమ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. అలా చేయకపోతే కార్డును రద్దు చేస్తారు. అప్పుడు రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే లక్షలాది రేషన్ కార్డులను ఈ-కేవైసీ నిబంధనలు పాటించలేదనే కారణంతో రద్దు చేశారు. కనుక ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ తో పాటు ఇతర పథకాలను పొందాలంటే.. రేషన్ కార్డు ఈ-కేవైసీ తప్పనిసరి. అందుకని ప్రతి కార్డుదారుడు తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి.. వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవాల్సిందే.
రేషన్ కార్డులో పేరున్న వారంతా ప్రస్తుతం జీవించే ఉన్నారా.. వారి పేరు మీద ఒక్కటే కార్డు ఉందా.. అనేక ప్రాంతాల్లో కార్డు జారీ చేశారా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరుగుతుంది.
ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే..
రేషన్ కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి (FPS) వెళ్లి, అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ (e-PoS) యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. దీనినే బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటారు.
ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ-కేవైసీ అప్‌డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు.
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్:
మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా, ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ పథకం ద్వారా మీరు ఉన్న దగ్గరలోని రేషన్ షాపులో కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది రేషన్ కార్డుదారులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని.. వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇదే కాక వరుసగా 3 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ కార్డు మీద రేషన్ తీసుకోకపోతే.. ఆ కార్డులు రద్దు చేస్తారు. కనుక ఈ-కేవైసీతో పాటు కార్డుని క్రమం తప్పకుండా వినియోగించడం చాలా ముఖ్యం.
