Greater Hyderabad
Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖచిత్రం మారిపోయింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్..మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCగా విభజించింది ప్రభుత్వం. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం..తర్వాత వార్డుల విభజన..కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఓ వైపు సికింద్రాబాద్ పేరే లేకుండా చేశారని లష్కర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జంట నగరాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్‌గిరిలో సగం..హైదరాబాద్ కార్పొరేషన్‌లో సగం కలిపేసి..సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లేకుండా చేశారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్‌ను జిల్లా చేస్తామంటూ ప్రకటించింది. ఇక జనగణన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక..గ్రేటర్‌లో వార్డుల విభజన, కార్పొరేషన్ల ఏర్పాటు చేశారని ఇది పూర్తిగా చట్ట విరుద్దమని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పైగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటులో..కోర్ హైదరాబాద్ రీజియన్‌లో ఎంఐఎం బలం పెరిగేలా కుట్రకు తెరలేపారని కమలనాథులు మండిపడుతున్నారు. రాజకీయ అభ్యంతరాలు ఇలా ఉండగా..ప్రభుత్వం మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా తన పని తాను చేసుకుపోతోంది. మూడు కార్పొరేషన్లకు కలిపి ఒకే స్పెషల్ ఆఫీసర్‌ను వేసింది సర్కార్. పైగా కొత్తగా సర్కార్ తీసుకొచ్చిన కొన్ని మార్పులు కార్పొరేషన్ల అధికారాలనే కాదు..ఆర్థిన వనరులను కూడా తగ్గించి పూర్తిగా ప్రభుత్వంపైనే డిపెండ్ అయ్యే పరిస్థితిని తీసుకొస్తుందన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
Also Read: చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
పాత GHMC పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల నుంచి గతంలో బల్దియాకు భారీ ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ నిర్మాణ ఫీజులతో ఆదాయం వచ్చేది. ఇప్పుడా మూడు జోన్లను వేర్వేరు కార్పొరేషన్లలో కలిపేశారు. ఇక ప్రస్తుతం ఉన్న GHMCపరిధిలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో నిర్మాణానికి అవకాశం ఉండే భూములు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో విభజిత GHMC ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందనేది అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ కమ్ తగ్గి..మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం భారంగా మారే అవకాశం ఉందంటున్నారు పలువురు అధికారులు.
ఇక మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి..నిర్మాణ అనుమతుల విషయంలో భారీ మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. 10 ఫ్లోర్ల వరకు మాత్రమే అనుమతులు అధికారం కార్పొరేషన్ అధికారులకు ఇచ్చింది. 10 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉండే అన్ని నిర్మాణాలకు HMDA ద్వారా పర్మిషన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. గ్రేటర్ చుట్టూ జరగబోయే పెద్ద పెద్ద నిర్మాణాలకు సంబంధించిన ఫీజులు..నిర్మాణ అనుమతుల ఫీజులు మొత్తం HMDA ఖజానాకు చేరే అవకాశం ఉందంటున్నారు.
ఆ ఫీజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ
ఇప్పటికే రిజిస్ట్రేషన్ల సందర్భం కార్పొరేషన్లకు రావాల్సిన నొటేషన్ ఫీజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఇలా మూడు కార్పొరేషన్లకు వచ్చే నిర్మాణ అనుమతుల ఫీజు భారీగా తగ్గిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో ఆర్థిక వనరులు తగ్గనున్నాయి. నిర్మాణ అనుమతుల విషయంలో HMDA సూపర్ పవర్‌గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక హైడ్రాకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీముల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది సర్కార్.
ఇలా కార్పొరేషన్ అధికారులు చేయాల్సిన పనులన్నీ హైడ్రాకు, HMDA వెళ్లిపోయాయన్న చర్చ ఉంది. ఇక మూడు కార్పొరేషన్లకు కలిపి జయష్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించడంతో..కార్పొరేషన్లు ఏం పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఇలా ఒకవైపు స్పెషల్ ఆఫీసర్..ఇంకోవైపు HMDA..మరోవైపు హైడ్రా..మధ్యలో కార్పొరేషన్లు అన్నట్లు మారిపోనుంది పరిస్థితి
2016 నుంచి 7వేల కోట్లకు పైగా అప్పులు చేసింది GHMC. ప్రస్తుతం 4860 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. వీటిని మూడు కార్పొరేషన్లకు ఎలా పంచుతారన్నది క్లారిటీ రాలేదు. ఒకవైపు ఆదాయం తగ్గిపోవడం, మరొక వైపు కార్పొరేషన్ పవర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, హైడ్రా పట్టు సాధిస్తుండడంతో..మూడు కార్పొరేషన్లు ఎలా ముందుకు వెళ్తాయనేది హాట్ టాపిక్ అయ్యింది. కేవలం నిర్వహణ పనులు మాత్రమే ఈ కార్పొరేషన్లు చేపట్టే అవకాశం ఉంది.
సిబ్బంది, అధికారుల కొరత
ఇక కార్పొరేషన్ల ముందున్న అతి పెద్ద సమస్య ఉద్యోగుల కొరత. కోర్ GHMCలోనే సిబ్బంది, అధికారుల కొరత తీవ్రంగా ఉండేది. ఉన్నవారిలోనే మూడు కార్పొరేషన్లకు చాలామందిని బదిలీ చేశారు. దాంతో GHMCలో ఉన్న సిబ్బంది తగ్గిపోగా..మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో కూడా సరైన సిబ్బంది లేరు. ఇలా ముందు చూపులేకుండా..వ్యవస్థలను సెట్‌రైట్ చేయకుండా..ఆగ మేఘాలపై మూడు కార్పొరేషన్లు చేయడంతో వివాదాలు, సమస్యలు తలెత్తాయన్న టాక్ వినిపిస్తోంది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం అయినప్పటి నుంచి శివారు ప్రాంతాలతో పాటు GHMCలో కూడా పాలన పడకేసిన పరిస్థితి. వార్డులు, జోన్లు, సర్కిల్స్ అవిభజన అధికారుల కేటాయింపునకే టైమ్ సరిపోయింది. ఇప్పటికీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో క్లారిటీ రాక దరఖాస్తులు పెండింగ్ ఉండిపోతున్నాయి. నిర్మాణ అనుమతుల విషయంలోనూ..నొటేషన్ల విషయంలోనూ సాగదీత కంటిన్యూ అవుతోంది. దీంతో గ్రేటర్‌లో విలీనం, విభజన, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫైనల్‌గా సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.