Harish Rao : హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. ’రూ.1000 కోట్ల భూ కుంభకోణం బయటపెడుతున్నాం’

Harish Rao : బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

harish rao Alleges rs 1000 cr shamshabad land scam

Harish Rao : బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ వస్తోన్న హరీష్ రావు.. తాజాగా రూ.1000 కోట్ల స్కామ్ బయట పెడుతున్నాం అంటూ బాంబ్ పేల్చారు. మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో రూ.1,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందంటూ ఆరోపించారు.. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో భూస్కామ్ వివరాలను వెల్లడించారు.

మేం వెయ్యి కోట్ల స్కామ్ బయట పెడుతున్నాం. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడితో పాటు ఓ మంత్రి ప్రమేయం కూడా ఉంది. శంషాబాద్ లో 180 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో వివాదం ఉంది. RDO ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొన్నారు. ఆ వెంటనే నాలుగు రోజుల్లో MRO ఇది ప్రైవేటు భూమి అని పేర్కొన్నారు. మరి నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారుతుంది అని హరీష్ రావు ప్రశ్నించారు.

నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారుతుంది. కలెక్టర్‌కు తెలియకుండా ఇంత భారీ కుంభకోణం జరుగుతుందా.. పైగా రూ.1000 కోట్ల కుంభకోణం జరిగితే.. సదరు MRO ని సస్పెండ్ చేయకుండా.. కేవలం ట్రాన్స్‌ఫర్ చేశారు. ఏసీబీ అధికారులు దీనిపై విచారణకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చారు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్దలు ఎవరు.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. ఈ వ్యవహారంలో MRO ని ట్రాన్స్‌ఫర్ చేసి… మళ్లీ భూభారతిలో పేర్లు ఎలా చేర్చారు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

MRO ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలి… ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలి, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఎందుకు వేయదని నిలదీశారు. చట్ట ప్రకారం ఆర్‌డీవో దరఖాస్తు చేసుకుని, నిర్ణీత సమయంలో ఆర్‌డీవో నిర్ణయం తీసుకోవాలని, కానీ ఇక్కడ ఆర్‌డీవో ప్రమేయం లేకుండా తహశీల్దార్ నిర్ణయం తీసుకున్నాడన్నారు. ఇదంతా బయటపడగానే గుట్టుచప్పుడు కాకుండా తహశీల్దార్‌ను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిట్ (SIT) ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.