Heavy Rain: బిగ్ అలర్ట్.. వర్షం పడే సమయంలో బయటకు రావొద్దు.. అత్యవసరమై వస్తే ఈ జాగ్రత్తలు పాటించండి..

హైదరాబాద్, దానిచుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వర్షంపడే సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని..

Heavy Rain

Heavy Rain: తెలంగాణ రాష్ట్రం (Telangana state)లో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, బుధవారం బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు  (Heavy Rain) కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorology Department) హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్, దానిచుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఈ క్రమంలో వర్షాలు వచ్చిన సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని, అత్యవసరమై బయటకువస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Heavy Rains: బయటకు రాకండి.. తెలంగాణలోని ఆ జిల్లాలకు రెడ్‌అలర్ట్.. ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు.. జీహెచ్ఎంసీలో ఒంటిపూట బడులు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షం దంచికొడుతుంది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు.

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్ జిల్లాలో నాలుగైదు మండలాల్లో వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. యాలాల్, కరన్ కోట్, బోంరాస్ పేట్, తాండూరు మండలాల్లో కాగ్నానది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే, వర్షాలు కురుస్తున్న సమయంలో అవసరమైతే తప్ప ప్రజలు టూవిల్లర్ పై ప్రయాణం చేయొద్దని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కల్వర్టులపైనుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ సమయంలో మోటార్ సైకిల్‌పై రోడ్డును దాటే ప్రయత్నం చేయొద్దని, ఒక్కోసారి బండి స్కిడ్ అయ్యి పడిపోయే ప్రమాదం ఉంటుందని, ఆ సమయంలో ప్రాణాలకే ముప్పువాటిల్లే పరిస్థితి ఉంటుందని ఎస్పీ సూచించారు.

కల్వర్టుల వద్ద ఇప్పటికే భారీ కేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆపద సమయంలో 100కు డైల్ చేస్తే పోలీసులు తగిన సహాయ చర్యలు చేపడతారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు.

ఈ సూచనలు పాటించండి..
హైదరాబాద్‌లోనూ ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా నగరవాసులకు హైడ్రా కీలక సూచనలు జారీ చేసింది. భారీ వర్షాలున్న సమయంలో బయటకు రావొద్దు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని హైడ్రా సూచించింది. సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరం పనులు ఉంటేనే బయటకు రావాలని, ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ఫాలో అవుతూ మీ పనులను షెడ్యూల్ చేసుకోవాలని హైడ్రా సూచించింది. మీ వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని, ముఖ్యంగా.. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జగ్రత్తగా వెళ్లాలని హైడ్రా సూచించింది.

ఇదిలాఉంటే.. బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు.

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్ల కుపైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి.


ఇదిలాఉంటే.. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.2 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. అదే జిల్లాలోని భీమినిలో 22.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.