తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
- Harishth Thanniru
- Published On : June 3, 2025 / 10:54 AM IST
heavy rains
Telangana Rain Alert: తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా ఇవాళ, రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో వాతావరణం చల్లబడింది. మేఘావృతమై ఉంది. ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు జూన్ 4వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
