Three Months Ration Rice at Once : రేషన్ కార్డుదారులకి శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి.. ఒక్కొక్కరికి 18 కేజీల సన్నబియ్యం..
Three Months Ration Rice at Once : తెలంగాణ రేషన్ కార్డుదారులకి శుభవార్త.. ఒకేసారి ఉచితంగా 18 కేజీల సన్న బియ్యం పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 09:17 AM IST
in telangana three months ration rice at once starts from 2026 april 1 government distribute fine rice
- రేషన్ కార్డుదారులకి శుభవార్త
- నేటి నుంచే ఒక్కసారే మూడు నెలల రేషన్
- తెలంగాణలో ఒక్కొక్కరికి 18 కేజీల సన్నబియ్యం
Three Months Ration Rice at Once : రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఒకేసారి 18 కేజీల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. కేంద్రం ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానుంది. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించిన రేషన్.. ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో.. కార్డుదారులకు నెలకు ఆరు కేజీల చొప్పున మొత్తం 18 కేజీల సన్నబియ్యం ఇవ్వనున్నారు.
వేసవి కాలం ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఏప్రిల్‌లోనే ఇవ్వనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు బుధవారం నుంచి మూడు నెలల రేషన్ పంపిణీ చేయనున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8,40,345 రేషన్ కార్డులు ఉండగా.. అందులో నమోదైన 32,24,284 మందికి.. 59,510.604 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న నేపథ్యంలో ఈకేవైసీ (eKYC) చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని సూచించారు.
మూడు నెలల రేషన్ పంపిణీకి తగ్గట్టుగా అవసరమైన బియ్యం నిల్వలు ఉన్నాయని, డీలర్లు తమ షాపులకు తీసుకెళ్లాలని ఇప్పటికే జిల్లా స్థాయి సివిల్ సప్లై అధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెలాఖరు దాకా రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం డీలర్లకు దశలవారీగా బియ్యం సరఫరా చేయనుంది. ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఈ-పాస్ (ePOS) మెషీన్‌లో మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఒక్కో వినియోగదారుడికి బియ్యం ఇవ్వడానికి సమయం కాస్త ఎక్కువ పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు తమకు సహకరించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
