Shabad Murders Case: షాబాద్ ఆరుగురి హత్యల కేసులో ట్విస్ట్.. పోలీసులకు చిక్కిన ఉన్మాది రాజ్ కుమార్? కొత్తూరులో సినీ ఫక్కీలో అరెస్ట్
రంగారెడ్డి జిల్లా షాబాద్(Shabad Murders Case)లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది పార్వతి రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.
Shabad 6 murders case accused Rajkumar arrested.
- పోలీసుల అదుపులో ఉన్మాది రాజ్‌కుమార్
- సినీ ఫక్కీలో వెంటాడిన కానిస్టేబుల్
- వదంతులు నమ్మొద్దన్న చేవెళ్ల డీసీపీ
Shabad Murders Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది పార్వతి రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం హోటల్‌కు వెళుతున్న ఓ అపరిచిత వ్యక్తిని కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నాడు. పట్టుబడిన వ్యక్తి షాబాద్ దారుణానికి ఒడిగట్టిన రాజ్ కుమారే అని స్థానికంగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే, పోలీస్ శాఖ మాత్రం ఈ అరెస్ట్ వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.
సినిమా స్టైల్లో వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్:
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న అపరిచిత వ్యక్తి (Shabad Murders Case)ఒక బైకర్‌ను లిఫ్ట్ అడిగి ఎక్కాడు. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ కానిస్టేబుల్ అతడిని గమనించి, అనుమానంతో అడ్డుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి బైక్ పైనుంచి దూకి పక్కనే ఉన్న వెంచర్ గోడ దూకేందుకు ప్రయత్నించగా.. కానిస్టేబుల్ స్థానికుల సహాయంతో అతడిని వెంటాడి పట్టుకుని, చేతులు కట్టేసి బైక్‌పై తీసుకువెళ్లాడు. ఈ ఘటనతో నిందితుడు దొరికిపోయాడనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది.
వదంతులను నమ్మొద్దు: చేవెళ్ల డీసీపీ
నిందితుడు పట్టుబడినట్లు లేదా ఎన్కౌంటర్ అయినట్లు సాగుతున్న ప్రచారాలపై చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు కూడా ఈ అరెస్టుపై ప్రస్తుతానికి గోప్యత పాటిస్తూ, ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
