Hyderabad Gold Man : సూర్య భాయ్ .. గింత మోసమా.. నువ్వు గోల్డ్ మ్యాన్ కాదా.. రోల్డ్ గోల్డ్ మ్యానా?

Hyderabad Gold Man : హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య భాయ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Income Tax Probe Finds Hyderabad Gold Man surya bhai Wore Fake Jewellery

Hyderabad Gold Man : హైదరాబాద్ ఓల్డ్ సిటీకి గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ గుర్తున్నాడా.. మెడ నిండా.. తిప్పడానికి కూడా వీలు లేకుండా భారీగా బంగారు గొలుసులు, చేతికి బంగారు బ్రాస్లేట్లు, కంకణాలు, వేళ్లకు ఉంగరాలు వేసుకుని తిరుగుతుంటాడు. అతడు ధరించిన నగలు చూస్తే.. ఈజీగా 2, 3 కేజీలు ఉంటాయని అనుకునేవారు. అతడు బయటకు కాలు పెడితే.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ తో ఫోటోలు దిగాలని జనాలు వెంటపడేవారు. మరి ఇన్నాళ్లు గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య భాయ్ గురించి నమ్మలేని విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. భాయ్ ఒంటి మీద ఉన్నదంతా బంగారం కాదట. సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలట. అంటే భాయ్ రోల్డ్ గోల్డ్ మ్యాన్ అన్నమాట. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను అధికారులే వెల్లడించారు. మరి ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న విచారణలో భాగంగా అధికారులు సూర్య భాయ్ వద్దకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో విజయ్ కుమార్ వద్ద నుంచి 1.4 కిలోల నిజమైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడి ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను విచారిస్తున్న క్రమంలో సూర్య భాయ్ అధికారుల దృష్టిలో పడ్డాడు. శుక్రవారం సాయంత్రం అధికారులు అతడిని విచారించారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణకు హాజరయ్యే సమయంలో అతడి ఒంటి మీద 12 ఆభరణాలు ధరించి వచ్చాడని అధికారులు తెలిపారు. ప్రారంభంలో వాటి విలువ సుమారు రూ.1 కోటి అని మొదట చెప్పాడు. కానీ విచారణ కొనసాగుతుండగా అనేక అనుమానాలు తెర మీదకు వచ్చాయి. చివరకు సూర్య భాయ్ ఒంటి మీద ధరించిన ఆభరణాల విలువ రూ.3 లక్షలకు పడిపోయిందట. అరే అదెలా సాధ్యం అంటే..

ఎందుకంటే అతడి ఒంటి మీద ధరించినవన్నీ బంగారు ఆభరణాలు కావట. అతడు ధరించిన వాటిలో ఎక్కువ ఆభరణాలు రాగితో తయారు చేసి వాటిపై రోడియం పూత వేసినవని, ఒకటి వెండి వాటి మీద బంగారు పూత వేశారని తేలింది. ప్రజల్లోకి వచ్చే సందర్భాల్లో కనీసం 32 ఇలాంటి నకిలీ ఆభరణాలను వాడినట్టు, అవి త్వరగా రంగు మారిపోవడంతో తరచూ మార్చేవాడని అధికారులు తెలిపారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా అతను తనను తాను ధనవంతుడైన “గోల్డ్ మాన్”గా ప్రదర్శించుకున్నాడని విచారణలో బయటపడింది.

జిమ్ ట్రైనర్ టూ గోల్డ్ మ్యాన్
అత్తాపూర్‌కు చెందిన 34 ఏళ్ల సూర్య భాయ్ (పల్లపు సురేష్ కుమార్), “ఓల్డ్ సిటీ” సూర్య భాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించడం, తెల్లని దుస్తులు వేసుకోవడం, ఆలయాలకు వెళ్లడం ద్వారా ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. కానీ నేటితో అతడి బండారం బయటపడింది. ఇవే కాక అధికారులు పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మినహా.. గత ఆరు సంవత్సరాలుగా అతను ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని అధికారులు తెలిపారు. పైగా ఐటీ రిటర్న్ దాఖలు చేసిన ఆ ఏడాది కూడా అతడు తన ఆదాయాన్ని రూ.4.9 లక్షలుగా చూపించాడట. ఆ ఆదాయం జిమ్, చికెన్ షాప్, ట్రైనర్‌గా చేసిన పనుల ద్వారా వచ్చినదని ఐటీ అధికారులు తెలిపారు. గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందడానికి కన్నా ముందు అతడు జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశాడు. సూర్య, అతడి భార్య పేరు మీద ఎలాంటి స్థిరాస్తి లేదని.. అతడు నెలకు రూ.20,000 అద్దెతో ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్నాడని అధికారులు గుర్తించారు.

ఆ స్వచ్ఛంద సంస్థలన్నీ ఫేకే..
థార్, సఫారి, ఎండేవర్, బుల్లెట్ వంటి వాహనాలు మాత్రం అతడి వద్ద ఉన్నాయని.. అయితే వీటిని ఎక్కువగా షో ఆఫ్ చేసుకోవడం కోసం మాత్రమే వినియోగించేవాడని.. వీటిని కూడా భూ వివాదాల పరిష్కారంలో కమిషన్ల ద్వారా సంపాదించిన డబ్బుతో కొని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అలాగే సూర్య భాయ్ నడుపుతున్నట్లుగా చెప్పుకుంటున్న SNS ప్రజా సేవ ఫౌండేషన్ మరియు వృద్ధాశ్రమం గురించి కూడా అధికారులు పరిశీలించగా, అవి రిజిస్టర్ అయిన సంస్థలు కాదని.. కనీసం పాన్ నంబర్ కూడా లేదని విచారణలో వెల్లడైంది. ప్రజల్లో గుర్తింపు.. సినిమాల్లో అవకాశాలు పొందడానికే తాను ఇలా నకిలీ బంగారం మెడలో వేసుకుని తిరిగే వాడినని వెల్లడించాడు.