Indiramma Indlu Scheme: ‘ఇందిరమ్మ ఇండ్ల’ లబ్ధిదారులకు అలర్ట్.. పలు నియోజకవర్గాల్లో మరోసారి లాటరీ.. టీజీహెచ్‌బీ కీలక ప్రకటన
హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Scheme) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది.
- V Santhosh Kumar
- Published on- September 21, 2026 / 05:04 PM IST
Indiramma housing scheme hyderabad second draw allotment letter application update
Indiramma Indlu Scheme: హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 600 మంది చొప్పున (480 మంది ప్రధాన జాబితా, 120 మంది వెయిటింగ్ లిస్ట్) ఎంపిక చేసి, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు చేపట్టారు. అయితే ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్ వంటి నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపునకు తగినంత సంఖ్యలో స్థానిక అర్హులు లభించలేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో మిగిలిన ఇళ్లను అర్హులైన స్థానిక దరఖాస్తుదారులకు కేటాయించేందుకు మరోసారి లాటరీ (డ్రా) నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నారు. కూకట్‌పల్లిలోనూ ఇతర ప్రాంతాల దరఖాస్తుదారులపై అభ్యంతరాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం సరిపడా స్థానికులు ఉన్నారని, ఒకవేళ కొరత ఉంటే అక్కడ కూడా తిరిగి డ్రా తీస్తామని అధికారులు స్పష్టం చేశారు.
అప్లికేషన్ సవరణలకు అవకాశం & డిపాజిట్ రిఫండ్:
ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Scheme) దరఖాస్తుల సమయంలో చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని ఎంపిక కాని దరఖాస్తుదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారుల తుది జాబితాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ రిఫండ్ ప్రక్రియ కొంత ఆలస్యమైందని, త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. అలాగే దరఖాస్తులో నియోజకవర్గం వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నేటి నుంచే అలాట్‌మెంట్ లెటర్లు:
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారులకు సోమవారం నుంచి వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు పంపనున్నట్లు టీజీహెచ్‌బీ వెల్లడించింది. లబ్ధిదారులు తమ ఆధార్ లేదా ఫోన్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
