Zahirabad Congress party : జహీరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. నడిపిస్తుంది ఆ ఇద్దరేనా..? ఎండ్‌కార్డ్ పడేదెలా..
Zahirabad Congress party : జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు హీటెక్కిస్తోంది. ఒకరంటే మరొకరికి పొసగక గాంధీభవన్ మెట్లెక్కారు నేతలు. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకొని పోటాపోటీ నిరసనలు చేపట్టారు.
- Harish Thanniru
- Published on- June 18, 2026 / 11:06 PM IST
Zahirabad Congress party
Zahirabad Congress party : జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు హీటెక్కిస్తోంది. ఒకరంటే మరొకరికి పొసగక గాంధీభవన్ మెట్లెక్కారు నేతలు. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకొని పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ కీలక నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచి మంత్రి అయ్యారు గీతారెడ్డి. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో గత ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను జహీరాబాద్ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్. నాన్ లోకల్ లీడర్ అయిన చంద్రశేఖర్ ఓడిపోవడం, జహీరాబాద్‌పై పట్టు సాధించేందుకు ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పుతుండటంతో ముసలం ముదురుతోందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే స్థానిక నేతలైన ఉజ్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సపోర్ట్‌తోనే జహీరాబాద్ బరిలోకి దిగిన చంద్రశేఖర్..వారితో ఎక్కువ కాలం సఖ్యత మెయింటెన్ చేయలేకపోయారట. సీనియర్లను కలుపుకునిపోకపోడంతోనే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న చర్చ నడుస్తోంది. చంద్రశేఖర్ గ్రూపులను ప్రోత్సహించడంతో..గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారట. అయితే జహీరాబాద్‌లోని ఐదు మండలాలు, రెండు టౌన్లకు పార్టీ అధ్యక్షులను నియమించడంతో చంద్రశేఖర్‌పై ఆయన ప్రత్యర్థులు విమర్శల దాడి ఇంకా పెంచారట.
ఎంపీ సురేష్ షెట్కార్ ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం నారాయణఖేడ్. అక్కడి నుంచి బరిలోకి దిగాలని భావించినా..చివరి నిమిషంలో సంజీవరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. గతం గతః. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారట షెట్కార్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జహీరాబాద్ రెండు సెగ్మెంట్లుగా విడిపోవడం ఖాయమని, తనకు టికెట్ రావడం కూడా పక్కా అని ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం జహీరాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నేత ఉండటంతో సిట్టింగ్ ఎంపీగా అక్కడి పార్టీ వ్యవహారాలు తానే చూసుకుంటానని చెబుతున్నారట షెట్కార్.
జహీరాబాద్ సెగ్మెంట్‌పై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా కూడా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. అన్ని కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో తన కూతరు త్రిషను జహీరాబాద్ నుంచి పోటీ చేయించాలనేది దామోదర వ్యూహంగా చెబుతున్నారు. ఈక్వేషన్స్ సెట్ కాకపోతే తన కూతురును తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నుంచి పోటీ చేయించి..ఆయన జహీరాబాద్ నుంచి బరిలోకి దిగే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జహీరాబాద్‌లో చంద్రశేఖర్‌ను తప్పించేందుకు మంత్రాంగం నడుస్తోందట. మంత్రి దామోదర రాజనర్సింహ తెరవెనుక ఉండి జహీరాబాద్‌లో వేలు పెడుతూ అసమ్మతి ని రాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు చంద్రశేఖర్ వర్గీయులు.
జహీరాబాద్ నియోజకవర్గంలో మండలాధ్యక్షు నియామకాలు సరిగా లేవని, వీటిని రద్దు చేయడంతో పాటు ఇంచార్జ్ బాధ్యతల నుంచి చంద్రశేఖర్‌ను తప్పించాలని ఆయన ప్రత్యర్థులు గాంధీభవన్ మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రశేఖర్ చేసిన నియామకాలు బాగున్నాయని, కష్టపడుతున్న వాళ్లకు పదవులు ఇచ్చారంటూ మరికొందరు గాంధీభవన్‌కు వచ్చి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీమంత్రి చంద్రశేఖర్‌ను నియోజకవర్గం నుంచి సైడ్ చేసేందుకే అటు దామోదర, ఇటు షెట్కార్ పావులు కదుపుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లా నేతల మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్‌ను పంపించాలనే ప్లాన్‌తో లీడర్లంతా ఒక్కటైనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రశేఖర్ కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. లోకల్ లీడర్లంతా ఒక్కతాటిపైకి వస్తుండటంతో చంద్రశేఖర్‌ను అక్కడి నుంచి పంపిచేస్తారా.? లేదా అసమ్మతిని రాజేస్తున్న ఎంపీ షెట్కర్, మంత్రి దామోదరను కంట్రోల్ చేస్తారా అనేది వేచి చూడాలి మరి.
