Jabardasth Artist Vinod : మళ్లీ పోలీస్ స్టేషన్‌కి జబర్దస్త్ నటుడు.. అసలేం జరిగిందంటే..
- Naveen
- Published On : April 8, 2021 / 04:05 PM IST
Jabardasth Artist Vinod
Jabardasth Artist Vinod : జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్‌లతో అలరించే వినోద్(అలియాస్ వినోదిని) మరోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఓ వివాదంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. జబర్దస్త్ నటుడు వినోద్ గురువారం(ఏప్రిల్ 8,2021) ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిశాడు. ఆయనకు వినతిపత్రం అందజేశాడు.
తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తామని యజమాని రూ.40లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నాడని, ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని వినోద్ తెలిపాడు. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నాడని వాపోయాడు. గతంలో తనపై భౌతికదాడి చేశారని… ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందించాడు వినోద్.
కాగా, ఈ వ్యవహారంలో వినోద్ పై గతంలో ఇంటి యజమాని దాడి చేశాడు. ఆ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై అప్పట్లో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఫిర్యాదు చేసినా కాచిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మీరైనా నాకు న్యాయం చేయాలని డీసీపీ రమేశ్ కి మొరపెట్టుకున్నాడు వినోద్.
ఇంటి ఓనర్ దాడితో తీవ్రంగా గాయపడ్డ వినోద్ తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో కూడా పోలీసుల్ని ఆశ్రయించాడు. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివసిస్తున్న వినోద్‌పై 2019 జూలైలో ఇంటి ఓనర్ దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన వినోద్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.
తనకి ఇల్లు అమ్ముతానని 13 లక్షల అడ్వాన్స్ తీసుకోవడమే కాకుండా.. తనపై హత్యాయత్నం చేశారని.. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య తనపై మూకుమ్మడి దాడి చేసి కొట్టారంటూ 2019 జూలైలో పోలీసులకు వినోద్ కంప్లైట్ చేశాడు. వినోద్ పై దాడి అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.
