Kothagattu Toll Plaza: కరీంనగర్-వరంగల్ హైవేపై నేటి నుంచి టోల్ బాదుడు.. కొత్తగట్టు వద్ద వసూళ్లు షురూ.. ఛార్జీల వివరాలు ఇవే!
కరీంనగర్-వరంగల్ హైవేపై కొత్తగట్టు వద్ద టోల్ ప్లాజా(Kothagattu Toll Plaza) ప్రారంభం కావడంతో నేటి నుంచి రుసుముల వసూలు మొదలైంది.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 09:34 AM IST
karimnagar warangal nh 563 kothagattu toll plaza operations begin
Kothagattu Toll Plaza: కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) మీదుగా ప్రయాణించే వాహనదారులకు నేటి నుంచి టోల్ మోత మోగనుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు(Kothagattu Toll Plaza) వద్ద భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద గురువారం ఉదయం 8 గంటల నుంచి రుసుముల వసూలు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 నుంచి నిర్వహిస్తున్న ఉచిత ట్రయల్స్ ముగియడంతో పూర్తిస్థాయిలో టోల్ వసూళ్లకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ టోల్ విధింపు కారణంగా ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో సాధారణ ప్రయాణికులపై భారం పడనుంది.
కార్లకు రూ.160, భారీ వాహనాలకు రూ.1,020 వరకు ఫీజు:
ఈ మార్గంలో ప్రయాణించే సాధారణ కార్లు, జీపులకు సింగిల్ జర్నీకి రూ.160, రిటర్న్ జర్నీకి రూ.235 వసూలు చేయనున్నారు. అయితే కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ (TS02) ఉన్న కమర్షియల్ కార్లకు రూ.80 ఛార్జ్ చేస్తారు. హెవీ వెహికల్స్, మల్టీ ఆక్సిల్ వాహనాలకు అత్యధికంగా సింగిల్ జర్నీకి రూ.1020 వరకు ఫీజు నిర్ణయించారు. ఈ మార్గం ద్వారా గ్రానేట్, సిమెంట్, సరుకుల రవాణా ఎక్కువగా జరుగుతున్నందున రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్థానికులకు బిగ్ రిలీఫ్.. రూ.360కే నెలవారీ పాస్:
టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు నేషనల్ హైవే అథారిటీ నిబంధనల ప్రకారం కొంత ఊరట కల్పించింది. టోల్ బూత్ నుండి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో నివసించే స్థానిక నాన్-కమర్షియల్ (సొంత) వాహనదారులకు నెలకు కేవలం రూ.360 కే నెలవారీ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కరీంనగర్, హన్మకొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఈ నూతన టోల్ ధరలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
