Kavitha: ఈ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది.. కాంగ్రెస్ పాలనపై కవిత ఆగ్రహం!
తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు, తాగు, సాగునీటి ఎద్దడిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha)తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Published on- October 4, 2026 / 05:08 PM IST
Kavitha: తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ తీవ్రమవుతున్న తీవ్ర కరవు పరిస్థితులు, తాగు, సాగునీటి ఎద్దడిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత(Kavitha) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎంతో బాధగా ఉందనడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం చేసి చేతులెత్తేశారని, కరవు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు.
కరవు మండలాల ప్రకటనలో విఫలం.. కృష్ణ జలాల తరలింపుపై మండిపాటు:
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన నీటి కొరత వేధిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కరవు మండలాలను ప్రకటించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే కరవు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి రైతులకు తగిన సహాయం అందుతుందని ఆమె సూచించారు. మన పాలమూరు ప్రాంతానికి రావాల్సిన కృష్ణ జలాలను ఏపీలోని కుప్పం వరకు తరలిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మన నీళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కరెంటు కోతలపై సవాల్.. ‘కొండారెడ్డిపల్లికి వస్తా’ అని హెచ్చరిక:
హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఉందని, రైతులకు సాగు కోసం రోజుకు ఆరేడు గంటలకు మించి ఉచిత విద్యుత్ అందడం లేదని కవిత ఆరోపించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని, దీనిని నిరూపించడానికి సీఎం సొంత ఊరైన కొండారెడ్డిపల్లికి రావడానికి కూడా తాను సిద్ధమని రేవంత్‌కు సవాల్ విసిరారు. రైతాంగానికి తక్షణమే పూర్తిస్థాయిలో ఉచిత విద్యుత్‌ను అందించి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
