Cm Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదులిచ్చారు సీఎం రేవంత్. మనమేమీ దైవాంశ సంభూతలం కాదని అన్నారు. శిబుసోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడియూరప్ప లాంటి వారు విచారణను ఎదుర్కోలేదా? జడ్జిల ముందులు చేతులు కట్టుకుని సమాధానాలు ఇవ్వలేదా? మనమేమీ అతీతులం కాదు కదా? అని వ్యాఖ్యానించారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే విచారణను ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని మండిపడ్డారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. మరిప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారు? అని రేవంత్ నిలదీశారు.
తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని అడిగారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్ట్ చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు కదా అని వ్యాఖ్యానించారు.
రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని చెప్పారు. పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు? అని ముఖ్యమంత్రి రేవంత్ నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.. హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదని అన్నారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అంటూ విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
”అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు. శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారు. మనమేం దైవాంశ సంభూతులం కాదు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారు. మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే.
కమ్యూనిస్టు సోదరులు నినాదాలు ఇచ్చారు, పోరాటాలు చేశారు. ఆ నినాదాలకు, పోరాటాలకు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్. దున్నే వాడికే భూమి అని పోరాడితే పేదలకు భూములు పంచింది కాంగ్రెస్. నాణేనికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు ఉండాలి. వన్ నేషన్.. వన్ పార్టీ అని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ SIR ను తీసుకొచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం. అందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిది” అని సీఎం రేవంత్ అన్నారు.
అటు రావి నారాయణరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారని గుర్తు చేశారు.
”బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి. దేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారు. 60ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. రావి నారాయణరెడ్డి పురస్కారం జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి దక్కడం గౌరవప్రదం.
తొలి తరంలో బూర్గుల, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే.. మలి తరంలో జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి. 2019లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డిని కోరా. కానీ తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరం అని, మీ లాంటి యువతరం రాజకీయాల్లో ఉండాలని ఆయన ప్రోత్సహించారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత మోదీని భయపెడుతుందని ఆయనను రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిగా బరిలో దించారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలని.. ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు” అని రేవంత్ అన్నారు.
Also Read: సజ్జనార్ ఏమీ జడ్జి కాదు.. ఇక చూస్కో.. కేటీఆర్ హాట్ కామెంట్స్