Khairatabad By-Election : బీఆర్ఎస్‌కు ఇజ్జత్ కా సవాల్‌గా ఖైరతాబాద్ బైపోల్.. అభ్యర్థిగా అతనేనా?
Khairatabad By-Election : ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేదెవరు.? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. దానంను ఎదుర్కొనేందుకు స్థానికంగా బలమున్న నాయకుడిని ఎంపిక చేయాలా.? లేక పార్టీ క్యాడర్తో సన్నిహిత సంబంధాలున్న నేతకు అవకాశం ఇవ్వాలా.? ఎవరు అభ్యర్థి అయితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే దానిపై ఇంటర్నల్ డిస్కషన్స్‌ను స్పీడప్ చేసిందట బీఆర్ఎస్.
- Harish Thanniru
- Published on- September 26, 2026 / 02:06 PM IST
Khairatabad By-Election
Khairatabad By-Election : గ్రేటర్ హైదరాబాద్‌లో మూడో ఉప ఎన్నిక. కంటోన్మెంట్ సిట్టింగ్ సీటును కోల్పోయామ్. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్‌ను ఓడిపోయామ్. ఖైరతాబాద్ సీటును ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాల్సిందే. పట్టుబట్టి..న్యాయపోరాటం చేసి..ఉప ఎన్నిక వచ్చేలా చేశామ్. గెలిచి తీరకపోతే ఇజ్జత్ కరాబ్ ముచ్చట అని భావిస్తోందట గులాబీ పార్టీ. అందుకోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందట. ఏ బస్తీలో ఏ లీడర్ బలంగా ఉన్నారు.? పబ్లిక్ మూడ్ ఎలా ఉంది.? ఉప ఎన్నికలో దానంను ఢీకొట్టే బలమైన నాయకుడు ఎవరన్నదానిపై కారు పార్టీ కూడికలు, తీసివేతలు స్టార్ట్ చేసిందట. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీకి ఖైరతాబాద్ బైఎలక్షన్ రాజకీయ పరీక్షగా మారనుందనే చర్చ మొదలైంది. ఉప ఎన్నికలో విజయం సాధించి క్యాడర్కు ఓ ఇండికేషన్ పంపిస్తేనే..వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని క్యాడర్‌లో ఓ నమ్మకం ఏర్పడుతుందని భావిస్తోందట కారు పార్టీ అధిష్టానం.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేదెవరు.? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. దానంను ఎదుర్కొనేందుకు స్థానికంగా బలమున్న నాయకుడిని ఎంపిక చేయాలా.? లేక పార్టీ క్యాడర్తో సన్నిహిత సంబంధాలున్న నేతకు అవకాశం ఇవ్వాలా.? ఎవరు అభ్యర్థి అయితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే దానిపై ఇంటర్నల్ డిస్కషన్స్‌ను స్పీడప్ చేసిందట బీఆర్ఎస్. స్థానిక నేతల అభిప్రాయాలు..పార్టీ సీనియర్ల సూచనలు..లోకల్ ఈక్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలని భావిస్తున్నారట. అభ్యర్థి ఎంపిక అతిపెద్ద సవాల్‌గా మారే పరిస్థితి ఉందట.
2014లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన మన్నె గోవర్ధన్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారట. తనకు కాకపోతే వరుసగా రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన తన భార్య మన్నె కవితకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. 2018లో ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన దాసోజు శ్రవణ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తనకు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. తన తండ్రి పీజేఆర్ అభిమానులు ఖైరతాబాద్‌లో ఎక్కువగా ఉన్నందున ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నారట. ఇక మరోవైపు బలమైన సామాజికవర్గం పేరుతో తలసాని సాయికిరణ్ రంగంలోకి దిగారు. నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్‌లోనూ యాదవ సామాజికవర్గం నేతే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ ఈక్వేషన్‌తో తనవంతు ప్రయత్నం చేస్తున్నారు తలసాని. దీంతో అటు ఆర్థికంగానూ..ఇటు సామాజికపరంగానూ బలమైన నేత కావడంతో తలసాని వైపే బీఆర్ఎస్ అధిష్టానం కూడా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయిపోయిందని..ప్రకటన ఒక్కటే ఆలస్యమని కూడా తలసాని శిబిరంలో చర్చ జరుగుతోంది.
గ్రేటర్ ఈక్వేషన్.. యాదవ్ సామాజికవర్గం ఓట్లు, బీసీ లెక్కలు.. దానంను ఢీకొట్టే బలమైన రాజకీయ, ఆర్థిక నేపథ్యం ఉన్న క్యాండిడేట్‌గా సాయికిరణ్‌కు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందట బీఆర్ఎస్. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని..తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పరిచయాలతో పావులు కదుపుతున్నారని అంటున్నారు. అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేసేలా ఆశావహులను ఒప్పించడమే సవాల్‌గా మారే పరిస్థితి ఉందట.
గత ఎన్నికల్లో మన్నె గోవర్ధన్‌రెడ్డి టికెట్ ఆశించి భగపడి బీఎస్పీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. తలసాని సాయికిరణ్ అభ్యర్థిత్వంపై అటు మన్నె గోవర్ధన్ గానీ.. ఇటు దాసోజు శ్రవణ్ గానీ.. పిజేఆర్ తనయుడు విష్ణు గానీ ఏమాత్రం సుముఖత చూపే అవకాశాలే లేవని అంటున్నారు. అదీగాక తలసాని సాయికిరణ్‌ను బరిలోకి దింపితే ఇంకో చర్చ తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. గతంలో తలసాని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఫిరాయింపుతో వేటు పడిన దానంపై..గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేసిన తలసాని కొడుకు పోటీ చేస్తే..అధికార పార్టీకి అస్త్రంగా మారే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.
దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ తరఫున సాయికిరణ్‌కు టికెట్ కన్ఫామ్ అయినట్లేనా.? లాస్ట్ మూమెంట్‌లో ఏదైనా మార్పులు ఉంటాయా.? కాంగ్రెస్ దానం నాగేందర్‌కే అవకాశం ఇస్తుందా.? ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లోనే సమాధానం దొరకనుంది.
