Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప‌ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని తనయుడు సాయికిరణ్? కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

Khairatabad By Election : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక వ్యవహారం కీలక చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉప ఎన్నిక వస్తే.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Khairatabad By-Election

Khairatabad By Election : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక వ్యవహారం కీలక చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ మారిన ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ న్యాయ పోరాటం చేసింది. చివరకు ఆయనపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది.

Also Read : Telangana Rains : వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ హెచ్చరికలు జారీ

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ లేదంటే రేపు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైనట్లే. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టిసారించింది. ఉపఎన్నిక వస్తే బరిలో ఎవరిని నిలపాలనే అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం.

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాలని గులాబీ పార్టీ అధిష్టానం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రముఖంగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దింపాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో తసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫోన్ చేసి ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సాయికిరణ్ ను పోటీకి పెట్టేందుకు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

సాయికిరణ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత ఎన్నికల్లోనూ అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో అధిష్టానం ఆ స్థానం నుంచి పద్మారావుగౌడ్ ను బరిలోకి దింపింది. అయితే, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. మంత్రిగా ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో తలసాని కీలకంగా వ్యవహరించడం కలిసి వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. దీనికితోడు తలసాని సామాజిక వర్గంకు చెందిన ఓటర్లతోపాటు ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతోపాటు.. వీరిలో ఎక్కువశాతం తలసాని కుటుంబానికి సానుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం సాయికిరణ్‌ను బరిలోకి దింపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీకి సంబంధించి రెండుమూడు రోజుల్లో నియోజకవర్గ ముఖ్యనేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా సాయి కిరణ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.