×
Ad

గుడిసెల కూల్చివేత చుట్టూ రాజకీయ దుమారం..! ఆరోపణలు ఏంటి? వాటిలో నిజమెంత?

తుమ్మల ప్రమేయం ఉందా? లేక ఆయన నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి అలిగేషన్స్ వస్తున్నాయా?

  • ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ తుఫాన్
  • భూదాన్ భూముల్లో కూల్చివేతలకు ఆర్డర్స్ ఇచ్చిందెవరు?
  • మంత్రి పొంగులేటికి తెలియకుండానే అధికారులు కూల్చేశారా?

ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఉన్న పేదల ఇళ్ల కూల్చివేత పొలిటికల్ హైడ్రామాకు దారితీసింది. భూదాన్ భూములు రెవెన్యూశాఖ పరిధిలో ఉంటాయి. అందులో కూల్చివేతలు చేపడితే..సంబంధిత శాఖ మంత్రికి సమాచారం ఉంటుంది. పైగా రెవెన్యూ శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకే చెందిన మినిస్టర్. దీంతో పలువురు ప్రజా సంఘాల నేతలు భూదాన్‌ భూముల్లో కూల్చివేతలపై మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారట.

అయితే కూల్చివేతల విషయం తనకు తెలియదని..ఖమ్మం కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారట మంత్రి పొంగులేటి. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి, పైగా జిల్లా మినిస్టర్‌ పొంగులేటికి తెలియకుండా కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అలా అయితే పొంగులేటిని కాదని కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిందెవరు.? అధికారులే సొంత నిర్ణయం తీసుకుని డిమాలిషన్‌ చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే వెలుగుమట్ల ప్రాంతంలో గజం లక్షల రూపాయలు, ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుందట. ఆ ప్రాంతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచురులకు భూములు ఉన్నాయని..లేదు మంత్రి పొంగులేటి సంబంధికులకే అక్కడ ల్యాండ్స్ ఉన్నాయని మరొకరు ఆరోపణలు చేసుకుంటుడం చర్చకు దారితీస్తోంది.

Also Read: జనంలోకి జనసేనాని.. దూకుడు వెనుక వ్యూహం అదేనా?

తమ ల్యాండ్ పక్కనే భూదాన్ భూముల్లో పేదలు గుడిసెలు ఉంటే..తమ భూముల ధర పడిపోతుందనే సాకుతో ఆ భూముల్లో ఉంటున్న పేదల ఇళ్లను తొలిగించారనే ఆరోపణలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. అయితే పేదల ఇళ్లు తొలగింపుకు మంత్రికి ఎటువంటి సంబంధం లేదని తుమ్మల అనుచరులు కొట్టిపారేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై రాజకీయ జోక్యం ఎలా ఉంటుందని ఎదరు ప్రశ్నలు వేస్తున్నారట. కూల్చివేతలపై తనకు సమాచారమే లేదని పొంగులేటి చెబుతున్నారు.

రెవన్యూ శాఖ మంత్రికి తెలియకుండా సాధ్యమేనా?
ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో అందరికి కీలకమైన మంత్రి పదవులే ఉన్నాయి. అయితే పాలేరు ఎమ్మెల్యే, రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవన్యూ శాఖ మంత్రికి తెలియకుండా భూదాన్ భూముల్లో కూల్చివేతలు సాధ్యమేనా.? అన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు కూల్చివేతపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మంత్రి పొంగులేటిని ప్రశ్నించారు.

దీంతో కలెక్టర్ అనుదీప్‌కు ఫోన్ చేసి పేదల ఇళ్ల కూల్చివేతపై సీరియస్ అయ్యారు పొంగులేటి. తన శాఖకు సంబంధించి తనకు తెలియకుండా ఎలా కూల్చివేస్తారు..ఇదేం పద్దతి అంటూ మండిపడ్డారు. ఇళ్లు కూల్చివేసిన భూదాన్‌ భూములు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని..ఖమ్మం నియోజకవర్గం మంత్రి తుమ్మలది కాబట్టి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారట మంత్రి పొంగులేటి. ఇళ్లు కూల్చివేసిన తర్వాత పలు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదు..కోర్టు తీర్పును అధికారులు అమలు చేశారని చెప్పుకొస్తోంది.

తనకేం సంబంధం లేదన్న పొంగులేటి
మంత్రి పొంగులేటి తనకేం సంబంధం లేదంటూ కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటు తుమ్మలకు సంబంధం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాంటప్పుడు భూదాన్‌ భూముల్లో కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిందెవరు.? రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటికి తెలియకుండానే డిమాలిషన్ చేపట్టారా.?

తుమ్మల ప్రమేయం ఉందా? లేక ఆయన నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి అలిగేషన్స్ వస్తున్నాయా? అధికారులే కోర్టు ఆర్డర్స్ ప్రకారం ముందుకెళ్లారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైతే కూల్చివేతల వెనుక ఎవరున్నరన్నది క్లారిటీ లేదు. కాకపోతే ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య మాత్రం కూల్చివేతలు కొత్త చిచ్చు పెట్టినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది. భూదాన్‌ భూముల్లో పేదల కూల్చివేత ఇష్యూ ఎటుదారితీస్తుందో చూడాలి మరి.