Maganti Gopinath Daughters : మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
Maganti Gopinath Daughters Car Accident : దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
- Harishth Thanniru
- Updated on- March 23, 2026 / 06:00 PM IST
Maganti Gopinath Daughters Car Accident
Maganti Gopinath Daughters Car Accident : దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ పై శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు కాగా.. చిన్న కుమార్తెతోపాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి సమయంలో ఫార్చునర్ కారులో అరేకపూడి దుర్గా సాయి, మాగంటి అక్షర నాగ, మాగంటి దిశర, మేడిపల్లి అభిరామ్ రెడ్డిలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు ప్రయాణిస్తున్నారు. దుర్గా సాయి కారు డ్రైవ్ చేస్తున్నారు. రాత్రి 11.30గంటల సమయంలో వారు టీజీపీఏ జంక్షన్ ను దాటుతుండగా వారి కారుకు ముందు డీసీఎం వాహనం వెళ్తుంది. అకస్మాత్తుగా డీసీఎం వాహనం వెనుక టైరు ఊడిపోవడంతో.. వాహనం వేగం ఒక్కసారిగా తగ్గిందింది. దీంతో డీసీఎం వాహనం వెనుకాలే ఉన్న మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వేగంగా వెళ్లి డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అక్షరకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
