Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురం, గ్రీన్‌సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సునీత అనే మహిళను దారుణంగా హత్య చేశాడు మహేశ్ అనే యువకుడు. సునీత ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో ప్రవేశించి ఆమెను దారుణంగా చంపాడు.
సునీతకు తాను మొదటి భర్తనని మహేశ్ చెబుతున్నాడు. తనకు తెలియకుండా ఆమె రెండో వివాహం చేసుకున్నందుకు చంపానని అంటున్నాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఎలా జరిగింది?
సునీత తన భర్త, తల్లితో కలిసి గ్రీన్ సిటీ కాలనీలో ఉంటోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఇంట్లోకి మహేశ్ ప్రవేశించాడు. తల్లి బట్టలు ఆరేయడానికి టెర్రస్‌పైకి వెళ్లడంతో ఇంట్లో సునీత మాత్రమే ఉంది.
వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లో చల్లాడు మహేశ్. మొత్తం తగలబెట్టేస్తాను అని బెదిరించాడు. సునీత కేకలు వేయడంతో కత్తితో పలుమార్లు పొడిచాడు. సునీత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది.
హత్య అనంతరం మహేశ్ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. పక్కింటి వారు అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని బాత్రూం తలుపులు బద్దలు కొట్టి మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ కేసులు పెట్టి తనను విదేశాలకు వెళ్లనివ్వకుండా చేసిందంటూ సునీతపై మహేశ్ పగ పెంచుకున్నాడు. శ్రీధర్ అనే వ్యక్తితో రెండో పెళ్లి చేసుకున్న సునీత ప్రస్తుతం మూడు నెలల గర్భవతి.